ఎన్డీయే ప్రభుత్వాన్ని మూడు పూటలా విమర్శించకపోతే కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టదు. ఏదోక పాయింట్ తీసుకుని, సాగదీసి గోల చేయాలనే చూస్తుంటారు. వాస్తవాలను వక్రీకరించి, అవాస్తవాలను ప్రచారం చేసి, తప్పుడు గణాంకాలను ప్రజాక్షేత్రంలో పెట్టి బీజేపీని కార్నర్ చేసినట్లు ఫోజులిస్తారు. ఎప్పటికప్పుడు భంగపాటు తప్పకపోయినా మళ్లీ మొదటికొచ్చి కొత్త అంశాన్ని ఎత్తుకుంటారు. తాజాగా కాంగ్రెస్ నేత చిదంబరం దేశంలో విమానాశ్రయాలపై చేసిన కొన్ని కామెంట్స్ కు మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు గట్టి కౌంటరిస్తూ ఆయన తీరును ఉతికి ఆరేశారు.
చిదంబరం ఏమన్నారు..
ఫళనియప్పన్ చిదంబరం కాంగ్రెస్ హయాంలో కేంద్ర ఆర్థిక శాఖ, హోంశాఖలను నిర్వహించారు. జాతి ప్రగతిపై బాగా అవగాహన ఉన్న నాయకుడే. కాకపోతే ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. సహేతుకం కాని తన సలహాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అక్కసుతో ఏదోక అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. తాజాగా విమానయానంపై ఆయన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. గత ఏడేళ్లలో 74 విమానాశ్రయాలు నిర్మించారన్న ప్రకటనలో డొల్లతనముందని చిదంబరం ఆరోపించారు. తొమ్మిది హెలికాప్టర్ స్టేషన్లు, రెండు వాటర్ డ్రోమ్ల మాటామిటని ప్రశ్నించారు. ప్రారంభించిన కొన్ని రోజులకే వాటర్ డ్రోమ్లను మూసేశారని చిదంబరం ఓ ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కొత్తగా 479 రూట్లను ప్రారంభించిందని అందులో 225 రూట్లలో ఇప్పుడు విమానయానం జరగడం లేదని చిదంబరం అన్నారు. బీజేపీ చెప్పే వాటిలో కొన్ని అర్థ సత్యాలైతే.. కొన్ని పూర్తి అబద్ధాలని చిదంబరం వ్యాఖ్యానించారు.
ముందు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి – జ్యోతిరాదిత్య
కాంగ్రెస్ పార్టీకి ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా మాట్లాడటం మొదటి నుంచి అలవాటేనని పౌర విమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎదురుదాడి చేశారు. చిదంబరంలో రాజకీయ మనుగడ కోసం ఆరాటం, అవకాశాలు లేక నిరాశ పెరిగిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. అబద్ధాలను వండి వార్చడం మానెయ్యాలని సలహా ఇచ్చారు. ఎన్నో ఏళ్లు నిరుపయోగంగా పడున్నవాటిని కలుపుకుని ప్రధాని మోదీ హయాంలో 74 విమానాశ్రయాలు వినియోగంలోకి వచ్చాయని సింధియా లెక్కచెప్పారు. ఆ 74లో కాంగ్రెస్ వాడలేకపోయినవి, కొత్తగా ఏర్పాటు చేసినవి కూడా ఉన్నాయని చిదంబరం ఎందుకు గుర్తించలేకపోతున్నారని సింధియా ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ విధానం కింద 2015 నుంచి 12 విమానాశ్రయాలను వినియోగంలోకి తెచ్చామన్నారు. వాస్తవం చెప్పాలంటే 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 3 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్స్ మాత్రమే నిర్మించారన్నారు.
ఉడాన్ స్కీమ్ పునరుద్ధరణ
విమానయానానికి డిమాండ్ పెంచినది కూడా తమ ప్రభుత్వమేనని సింధియా గుర్తుచేశారు. మార్కెట్ డిమాండ్ ను బట్టి ఒక రూట్లో విమానాల నిర్వహణ ఉంటుందని, డిమాండ్ పెరిగినప్పుడు విమానాశ్రయ మౌలిక సదుపాయాలను వాడుకుంటామని ఆయన చెప్పారు. ఉడాన్ స్కీమ్ ద్వారా చిన్న నగరాలకు విమానాలు నడుపుతున్నామని, ఆయా ప్రాంతాల్లో కొత్తగా బిడ్డింగ్ కూడా జరుగుతోందని చెప్పారు. ఉడాన్ స్కీమ్ కిందనే విమానాశ్రయాల పునరుద్ధరణ జరిగిందన్నారు. ఉడాన్ స్కీమ్ కిందనే 2.23 లక్షల విమానాలు నడిచాయని, 1.23 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరారని మంత్రి వివరించారు. చిదంబరం లాంటి వాళ్లు ట్విట్టర్ లో విమర్శలు చేసినంత మాత్రాన వాస్తవాలు చెరిగిపోవని సింధియా అన్నారు. ప్రాంతీయ విమానయాన సంస్థలు పుట్టుకొచ్చేందుకు కూడా ఉడాన్ పథకం దోహదం చేసిందన్నారు. ఇలాంటి పరిణామాలు కారణంగా విమానయాన రంగంలో రూ. 75 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. ఆరు దశాబ్దాల పైగా కాంగ్రెస్ చేయలేని పనిని పదేళ్ల కంటే తక్కువ కాలంలో తాము చేసి చూపిస్తే చిదంబరం లాంటి వాళ్లు భరించలేక నానా యాగీ చేస్తున్నారన్నారు.
కిరణ్ రిజిజు ఆగ్రహం
చిదంబరం వ్యాఖ్యలపై మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి తనతో వస్తే ఈశాన్య రాష్ట్రాలన్నీ తిప్పి వాస్తవమేమిటో చూపిస్తానన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక విమానాశ్రయాలు, హెలీపోర్టులు నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.