ఇంగ్లీష్ భాషే భారతీయుల టాలెంట్ ను చంపేస్తోందా… ?

బ్రిటిష్ వాళ్లు వదిలివెళ్లిన ఆంగ్లం భారతీయుల పట్ల శాపంగా మారింది. గ్రామీణ టాలెంట్ బయటకు రాకుండా అడ్డుకుంటున్న భాష ఆంగ్లం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు 145 కోట్ల ప్రజల అభిమాన నాయకుడు ప్రధాని మోదీ ఈ మాట అన్నారు. ఇంగ్లీష్ తో భారతీయ భాషలు దెబ్బతింటున్న తీరుపై ఆయన ఆవేదన చెందారు.

ప్రస్తుత పరిస్థితులు ఏమిటి …?

స్వాతంత్ర్యం తర్వాత ఇంగ్లీష్ శక్తిమంతమైన భాషగా మారిపోయిందని మోదీ గుర్తుచేశారు. దేశంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలను ఇంగ్లీష్ చదువులు చదివించాలనుకుంటున్నారని మోదీ 29వ జాతీయ విద్యా సదస్సులో ప్రస్తావించారు. ఉపాధ్యాయుల సేవలను ప్రస్తావిస్తూ.. ఇంగ్లీష్ డామినేషన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంట్ ఉన్న ఉపాధ్యాయులను దేశం వినియోగించుకోలేకపోతోందని కూడా ప్రధాని అంగీకరించారు. బోధనపై ఆసక్తి ఉండి, అంకితభావంతో పనిచేయగల టీచర్లు, ఆంగ్లం రాక ఇబ్బంది పడుతున్నారన్నారు.

నూతన విద్యా విధానంతోనే సాధ్యం

మోదీ తన ప్రసంగంలో నూతన విద్యా విధానాన్ని ప్రస్తావించారు. దేశంలో ఇప్పుడు బీజేపీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం కూడా అదే ఆలోచనా విధానంతో ఉంది. దాన్ని సక్రమంగా అమలు చేయగలిగితే ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన గణనీయంగా పెరిగి ఆంగ్ల ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నారు. మాతృభాషలో చదువుకోవడం ద్వారా పిల్లల భావ ప్రకటనకు, మనో వికాసానికి అవకాశం ఉంటుంది. వారి టాలెంట్ ను ప్రదర్శించేందుకు వీలు కలుగుతుంది. స్థానిక టీచర్లకు విద్యాబోధనలో వెసులుబాటు కలుగుతుంది.

ఒత్తిడిని తగ్గించే చదవులు

ఐదేళ్ల కసరత్తు తర్వాత 2020లో ఆమోదించిన నూతన విద్యా విధానాన్ని ఈ మధ్యనే పూర్తి స్థాయిలో అమలుకు తెచ్చారు. త్రిభాషా సూత్రం ప్రకారం విద్యార్థులు తమ పాఠశాలల్లో మూడు భాషను నేర్చుకునే అవకాశం పొందుతారు. ఐదో తరగతి వరకు మాతృభాష లేక స్థానిక భాషలో బోధనను నూతన విద్యా విధానం నొక్కి చెబుతుంది. ఎనిమిదో తరగతి ఆ పైన కూడా ప్రాంతీయ భాషలో చదవులు ఉంటే బావుంటుందని సూచిస్తోంది.

టెస్ ప్లస్ టూ విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించారు. ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం అమలుకు రాబోతోంది. కితాబీ గ్యాన్ అంటే పుస్తకాలపై ఆధారపడి బట్టి పట్టే పద్దతి పోవాలన్నదే మన విధాన నిర్ణేతల ఆలోచనా విధానంగా చెప్పుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తిని కూడా పెంచుతారు.

మూడు నుంచి ఐదో తరగతి వరకు ఉన్న చదువే పిల్లలకు కీలకంగా చెప్పుకోవాలి. ఇది 8-10 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది. ఇది క్రమంగా మాట్లాడటం, చదవడం, రాయడం, శారీరక విద్య, భాషలు, కళ, సైన్స్, గణితం వంటి విషయాలను పరిచయం చేస్తుంది.తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు చదువుల్లో క్రిటికల్ థింకింగ్ కు అవకాశం ఉంటుంది. నూతన విద్యా విధానం అమలుకు స్థూల జాతీయోత్పత్తిలో ఆరు శాతం కేటాయించి, అన్ని పనులు పర్యవేక్షించాలని విద్యా శాఖను ఆదేశించారు.

భారతీయతను కాపాడుతూ, అత్యాధునిక పద్దతులను అలవాటు చేసుకోవడమే నూతన విద్యా విధానం ముఖ్యోద్దేశం. అన్ని సబ్జెకులను ప్రాంతీయ భాషల్లో అనువదించడం, సంస్కృతం సహా ఇతర ప్రాచీణ భాషలను నేర్చుకునేందుకు అవకాశం కల్పించడాన్ని అజెండాలో చేర్చారు. ఆరో తరగతి నుంచి కంప్యూటర్ భాషలు నేర్పిస్తారు. ఉన్నత చదువుల్లో ఫిజిక్స్ తో పాటు అకౌంట్స్ కూడా చదివే అవకాశం కల్పిస్తారు. దీనితో విద్యార్థులు తమకు నచ్చిన అన్ని సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం కలుగుతుంది.