వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ.. భారత్ లో చిచ్చుపెడుతూ..

వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ.. భారత్ లో చిచ్చుపెడుతూ..

ఉత్తర అమెరికా దేశం కెనడాకు, దక్షిణాసియాలో ఉన్న భారత్ కు ప్రవాస సిక్కుల కారణంగా విభేదాలు ముదిరి వివాదం పెద్దది అవుతోంది. కెనడాలో ఉంటూ పంజాబ్ ను ప్రత్యేక దేశంగా చూడాలనుకుంటున్న ఖలీస్థానీ ఉగ్రవాదుల దుశ్చర్యలు ఇప్పుడు ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీయడం మాత్రమే కాకుండే మనదేశంలోనూ చిచ్చుపెడుతున్నాయి. ఉగ్రవాదాన్ని బహిరంగంగా పెంచి పోషిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న చందంగా మనమీదే ఆరోపణలు చేస్తున్నారు…

జీ-20 సదస్సులోనే ..

కొద్దికాలంగా కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల సంస్థల కార్యకలాపాల కారణంగా భారత్‌ – కెనడా సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది.ఈ ఏడాది జులైలో కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల సంస్థలు, భారతీయ దౌత్యవేత్తల పోస్టర్లు అంటించి, వారిని టార్గెట్‌గా ప్రకటించాయి.ఈ సంఘటన తర్వాత కెనడా హైకమిషనర్‌ను పిలిపించిన భారత్, అక్కడ జరుగుతున్న ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యలను కెనడా ప్రధాని ట్రూడో జీర్ణించుకోలేకోపోయారు. జీ-20 సదస్సుకు ఆయన వచ్చినప్పుడు ప్రధాని మోదీ .. ఖలిస్థాన్ వేర్పాటువాద చర్యలపై గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దానితో ఆగ్రహం చెందిన ట్రూడో.. ఇక్కడ మెదలకుండా ఉండి స్వదేశానికి వెళ్లిన తర్వాత ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. భారత్ – కెనడా ట్రేడ్ మిషన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

నిజ్జర్ హత్యతో ఉద్రిక్తతలు

ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్థాన్ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్య తర్వాత సిక్కు వేర్పాటువాదులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. కెనడాలోని ప్రధాన నగరాలతో పాటు లండన్, మెల్బోర్న్ , శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా నిరసనలు నిర్వహించారు. నిజ్జర్ హత్య భారత ప్రభుత్వ ఏజెంట్ల పనేనని కెనడా అధికారికంగా ఆరోపించడం వివాదమవుతోంది. ట్రూడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే కెనడా సర్కారు ఇలాంటి ప్రకటన చేసిందని చెబుతున్నారు. మోదీ, ట్రూడో సమావేశమైన రోజే కెనడాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అలాంటి చర్యలను కెనడా ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా మద్దతిస్తోంది. ఆ సంగతిని గ్రహించే కెనడా తీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్రూడోకు స్వదేశంలో ఇబ్బందులు

స్వదేశంలో ఠికానా లేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్న ట్రూడో.. ఇప్పుడు డైవర్షన్ కోసం ఇండియాపైన విరుచుకుపడుతున్నారని అనుకోవాలి. కెనడాలో ఆయన పాపులారిటీ గణనీయంగా పడిపోయింది. ప్రధాన ప్రతిపక్ష నేత పియరీ పొయిలివ్రేకు 40 శాతం మంది కెనడియన్లు మద్దతు పలుకుతున్నారు. ఆయనకు ప్రజాదరణ ఐదు శాతం మేర పెరిగింది. మరో పక్క ట్రూడో పాపులారిటీ 31 శాతం వద్దే ఉందని సర్వేలు చెబుతున్నారు. దీనితో డైవర్షన్ కోసం ట్రూడో నాటకాలు ఆడుతున్నట్లు భావిస్తున్నారు. కెనడాపై ఆధిపత్యానికి భారత్ ప్రయత్నిస్తోందన్న ప్రచారానికి కూడా తెర తీశారు..

భారత్ లో విభేదాలు సృష్టించేందుకే..?

దేశంలో సిక్కుల జనాభా రెండు శాతం మాత్రమే. అయినా వారియర్ క్లాస్ గా పేరుపొందిన వాళ్లు దూకుడుగా ఉంటారు. తాము తలచుకున్నది సాధించాలనుకున్న తపన వారిలో ఉన్న మాట వాస్తవమే అయినా.. దారితప్పిన కొందరు వేర్పాటువాదం వైపుకు మొగ్గుచూపారు. శాంతియుత మార్గాల ద్వారా వారిని దారికి తెచ్చి సిక్కుల కోసం దేశం చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు వివరిస్తూనే ఉన్నాయి. అయితే విదేశాల్లో ఉన్న కొందరు సిక్కు నేతలు ఇక్కడి ప్రజల భావోద్వేగాలు ఆధారంగా ఖలిస్తాన్ ఉద్యమంతో పబ్బం గడుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. కెనడా ప్రభుత్వం వారిని ప్రోత్సహించడం, భారత ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నా వాటిని ఆపకపోవడం వెనుక ఏమున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్ అమరీందర్ సింగ్.. పంజాబ్ సీఎంగా ఉన్నప్పుడు కెనడాలో సిక్కు వేర్పాటువాద కార్యకలాపాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తుల జాబితాను కెనడా ప్రభుత్వానికి పంపినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. విదేశాల్లో సిక్కు వేర్పాటువాద కార్యకలాపాల కారణంగా పంజాబ్ రాష్ట్రంలోనూ ఉద్రిక్త పరిస్తితులు ఎదురవుతున్నాయి. అక్కడి నేతల చర్యలతో ఇక్కడ కొందరు రెచ్చిపోయి శాంతి భద్రతలు సృష్టిస్తున్నారు. ఇటీవలే ఒక సిక్కు వేర్పాటువాద నాయకుడు అమృత్ పాల్ సింగ్ ను కెనడా ప్రభుత్వం అరెస్టు చేసింది. ట్రూడోకి ఇవేమీ పట్టవు. భావోద్వేగాలను రెచ్చగొట్టి 2025 కెనడా పార్లమెంటు ఎన్నికల్లో ఆయన గెలవాలి అంతే….