Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ పని చేసినా సంచలనమే. ఉద్యోగులను తొలగించడంలోను, ఆయా కంపెనీల షేర్ విలువను పెంచడం తగ్గించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఈ బిలియనీర్ చేసిన పని నెట్టింట చర్చకు దారితీసింది. కోట్లకొద్దీ వెచ్చించి కొనుగోలు చేసిన ట్విట్టర్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో పలు మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఏళ్ల తరబడి ట్విట్టర్ లోగోగా ప్రసిద్ధి చెందిన నీలం రంగు బుల్లిపిట్టను మారుస్తూ మస్క్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రిప్లోకరెన్సీ Dogecoin కు చెందిన కుక్క మీమ్ ను దాని స్థానంలో పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి బుల్లిపిట్టకే ఆయన ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ వెబ్ వెర్షన్ ను సంబంధించిన హోమ్ బటన్ ను బుల్లిపిట్టగా పునరుద్ధరించారు.
అయితే మొబైల్ యాప్ లోగోలో ఇప్పటికీ ఎటువంటి మార్పులు చేయకపోవడం విశేషం. ఈ విషయంపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ట్టిట్టర్ వినియోగదారులు డాగ్ లోగోతో కూడిన వివిధ కామెడీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోటీని సైతం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో పలు బ్రాండ్ లు మరియు కార్పొరేట్ సంస్థలు చురుకుగా పాల్గొన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ట్విట్టర్ హోమ్ పేజీలో పక్షులకు బదులు జంతువులను చూస్తున్నామని పోస్ట్ చేయడంతో వివిధ IPL జట్లు కూడా సరదాగా ఇందులో పాలుపంచుకున్నాయి. అయితే ఓ వినియోగదారుడు ట్విట్టర్ లోగోను డాగ్ గా మార్చమని తనను అభ్యర్థించిన సంభాషణ స్క్రీన్ షాట్ ను మస్క్ పంచుకున్నారు. ఎలాన్ మస్క్ చేసిన ఈ పనివల్ల Dogecoin విలువ దాదాపు 30 శాతం పెరిగినట్లు బ్లూమ్ బర్గ్ నివేదించింది. అయితే ట్విట్టర్ లోగోను దాని పూర్వ రూపానికి పునరుద్ధరించిన తర్వాత 10 శాతం పతనమైనట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. క్రిప్టోకరెన్సీకి మద్ధతుగా పిరమిడ్ స్కీమ్ ను సులభతరం చేస్తున్నారంటూ మస్క్ పై 258 బిలియన్ డాలర్ల దావా వేసినట్లు వార్తలు వచ్చాయి. Dogecoin విలువను రెండేళ్లలో 36 వేల శాతం పెంచి, ఉద్దేశపూర్వకంగా క్రాష్ అయ్యేలా చేశారని అభియోగాలు సైతం నమోదయ్యాయి.