దీదీ ప్రోత్సహిస్తున్న ఎన్నికల హింస

ప్రాంతీయ పార్టీలతో ఒక సమస్య ఉంది. వారికి ఎన్నికల విజయమే ముఖ్యం. మంచి చెడు విచక్షణా జ్ఞానం వారిలో ఉండదు. గెలుపు కష్టమనుకుంటే అన్ని అడ్డదారులు తొక్కి వాళ్లు విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు. డబ్బు వెదజల్లుతారు. హత్యలు, దాడులతో పక్క పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తారు. చంపడం అనేది వారికి సాధారణ విషయం. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే..

పంచాయతీ ఎన్నికల హింస

జూలై 8న బెంగాల్ రాష్ట్రమంతటా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైందే తడవుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ గూండాలు రంగంలోకి దిగారు. ఒక పక్క నామినేషన్లు దాఖలు చేస్తూనే మరో పక్క ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారు. ముషీదాబాద్ లో ఒక కాంగ్రెస్ కార్యకర్తను కొందరు దుండగులు కాల్చిచంపారు. అదీ తృణమూల్ వారి పనేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. జూన్ 12న ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేపైనే కొందరు దుండగులు దాడి చేశారు.

ఆటవిక రాజ్యం ఉందంటున్న సువేందు

బీజేపీ నేత సువేందు అధికారి బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం విలయతాండవమాడుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో భద్రతా దళాలను మోహరిస్తేనే శాంతియుత పంచాయతీ ఎన్నికలు సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధిర్ రంజన్ చౌదరి కూడా మమత ప్రభుత్వ తీరుపై విమర్శలు సంధించారు. రాష్ట్రంలో కేంద్ర బలగాలు మోహరించాల్సిన అనివార్యత ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

తృణమూల్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక

హింసపై అధికార టీఎంసీ తనదైన శైలిలో స్పందించింది. చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రంలో జరిగిందేమి లేదని, విపక్షాలు భూతద్దం పెట్టి చూపిస్తున్నాయని ఎదురుదాడికి దిగింది. తాజా ఘటనలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిజానికి

భద్రత పెంచాలంటున్న బీజేపీ

ఎన్నికల హింస పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో భద్రత పెంచాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎక్కడెక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయో వివరాలు సేకరించి ఒక నివేదికను సమర్పించింది. తమ కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేయకుండా టీఎంసి నేతలు అడ్డుకుంటున్నారని బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం చెబుతున్నాయి. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా వెల్లడించాయి. విపక్ష అభ్యర్థులను నామినేషన్ పత్రలు ఇచ్చాడన్న కోపంతో దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పై తృణమూలు కార్యకర్తలు దాడి చేశారు. చావు బతుకుల మధ్య ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా హింసాత్మక ఘటనలు తప్పలేదు. అప్పుడు 13 మంది చనిపోతే 150 మంది వరకు క్షతగాత్రలయ్యారు. బాంబు దాడులు జరిగాయి. బ్యాలెట్ పెట్టెలను తగులబెట్టారు. ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి..