సూదిమొనంత భూమిని కూడా వదులుకోం.. చైనాాకు అరుణాచల్ నుంచి షా వార్నింగ్

ప్రధానాంశాలు:

  • అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటోన్న పొరుగు దేశం
  • చైనా సరిహద్దుల్లోని చివరి గ్రామంలో షా పర్యటన
  • వైబ్రంట్ విలేజ్ కార్యక్రమానికి హోం మంత్రి హాజరు

చైనా (China) అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ భారత హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) సోమవారం పర్యటించారు. చైనా సరిహద్దు గ్రామమైన కిబితూ (Kibithoo)లో ఆయన ‘వైబ్రెంట్‌ విలేజ్‌’ (Vibrant Village Programme) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రాగన్‌కు గట్టి హెచ్చరికలు పంపారు. భారత భూభాగాన్ని ఇతరులు కబ్జా చేసే రోజులు పోయాయనీ, సూది మొనంత భూమిని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. ఎవ్వరూ మన సరిహద్దులవైపు కన్నెత్తి చూడలేరని హెచ్చరించారు. మన వీర జవాన్లు, ఐటీబీపీ సిబ్బంది భారత భూభాగంలో అంగుళం భూమైనా అన్యాక్రాంతం కానివ్వరని కేంద్ర హోం మంత్రి ఉద్ఘాటించారు.

అరుణాచల్‌లో ఎవ్వరూ నమస్తే అని కాకుండా జైహింద్‌ అంటూ ఒకరినొకరు పలకరించుకుంటారనీ, ఈ కారణంతోనే చైనీయులు ఇక్కడి నుంచి తోక ముడవాల్సివచ్చిందని అన్నారు. ‘మా విధానం శాంతి.. అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాం.. కానీ, కనీసం అంగుళం భూమిని కూడా ఆక్రమించుకోడానికి అనుమతించం’ అని షా తేల్చిచెప్పారు. ఎల్ఏసీకి దక్షిణంగా 15 కి.మీ, భారత్, చైనా, మాయన్మార్ కూడలికి పశ్చిమంగా 40 కి.మీ. దూరంలో ఉండే కిరబతిని సరిహద్దుకు చిట్టచివరి గ్రామంగా భారత్ భావిస్తోంది.

వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ (VVP) అనేది స్థానికులు వలస వెళ్లకుండా గ్రామాలలో అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ప్రధాని మోదీ రూపొందించిన పథకం. సరిహద్దు ప్రాంతాల్లో అప్‌గ్రేడ్ చేసిన మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నందున వ్యూహాత్మక కోణాన్ని కూడా కలిగి ఉండటంతో ఇది చైనాకు చికాకు కలిగించింది. సైనికుల కదలికను సులభతరం చేయడానికి ఎల్ఏసీ వైపున మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై చైనా దృష్టి సారించినప్పటికీ, సరిహద్దులో భారతదేశం కూడా అదే పని చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

2014 వరకు బీజింగ్ నిరసనలు భారతీయ అధికారులకు ప్రతిబంధకంగా పనిచేశాయని, అభ్యంతరాలను పట్టించుకోకుండా ఎల్ఏసీ దగ్గరగా ఉన్న ప్రాంతాలలో రోడ్లు, వంతెనల నిర్మాణాలు వేగవంతం చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. సరిహద్దు గ్రామాలను చివరి గ్రామాలుగా కాకుండా భారతదేశపు తొలి స్థావరాలుగా పరిగణించాలని ప్రధాని కోరారు.

సరిహద్దు గ్రామాల విషయంలో తమ వైఖరిని షా వివరిస్తూ… ‘కిరిబితూ భారతదేశపు మొదటి గ్రామం, చివరి గ్రామం కాదు. ఈ సంభావిత మార్పునకు ప్రధానమంత్రి మోదీ కారణం.. కష్టతరమైన భూభాగంలో నివసించే ప్రజలు, సరిహద్దు రక్షణ దళాలు, సైన్యం పట్ల ఆయనకున్న ప్రేమ, ఆప్యాయత, గౌరవానికి ఇది నిదర్శనం. సరిహద్దు ప్రాంతాలే ప్రధానికి ప్రాధాన్యత. అవి జాతీయ భద్రతకు కీలకమైనవి.. అందుకే సరిహద్దు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది’ అని కుండబద్దలుకొట్టారు. ఇక, అమిత్‌ షా అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శించడం ద్వారా తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని చైనా విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం దీనిని తిప్పికొట్టింది.