మైత్రీ మూవీస్, సుకుమార్ పై ఈడీ దాడులు… జీఎస్టీ ఎగ్గొట్టడమే కారణమా.?

రీసెంట్ గా టాలీవుడ్ లో హిట్టైన సినిమాలు, పెద్ద హీరోలు సినిమాలు లిస్ట్ తీస్తే కామన్ గా కన్పించే, విన్పించే పేరు మైత్రీ మూవీ మేకర్స్. అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైలు నవీన్, రవిశంకర్ వరుసపెట్టి సినిమాలు తీసేస్తున్నారు. పుష్ప, సర్కారు వారి పాట, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే.. లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నిర్మాతల మీద ఈడీ రైడ్స్ చేసింది. ఉదయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో ఈడీ సోదాలు నిర్వహించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుతో పాటు.. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఇన్ కం ట్యాక్స్ ఫైలింగ్ లో అవకతవకలు, జీఎస్టీ ఎగవేతపైనే ప్రధానంగా కంప్లైట్లు వచ్చాయని… అందువల్లే ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


గత డిసెంబరులో కూడా ఈడీ ఆరా
మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేయడం ఇదే తొలిసారి కాదు. గత డిసెంబరులో కూడా సోదాలు చేసింది. అయితే సోదాలు పూర్తైన తర్వాత ఏం జరిగింది, కేసు ఏమైనా ఫైల్ చేశారా, లేదంటే ఫైన్ తో వదిలేశారా అనేది మాత్రం బయటకు రాలేదు. గత రెండేళ్ల నుంచి భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్… దాదాపు 700 కోట్ల రూపాయలకు జీఎస్టీ కట్టలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా విదేశాల నుంచి కూడా ఫండింగ్ ద్వారా భారీ మొత్తాలను తీసుకొస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అటు సుకుమార్ కూడా పుష్ప సినిమా ద్వారా తనకొచ్చిన రెమ్యూనరేషన్ కు సంబంధించి జీఎస్టీ, ఇన్ కం ట్యాక్స్ సరైన పద్ధతిలో చెల్లించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.


సోదాలు సోదాలే… సినిమాలు సినిమాలే
ఓవైపు ఈడీ సోదాలు అవుతున్నా… సినిమా మేకింగ్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడడం లేదు. ప్రస్తుతం తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ఈ బ్యానర్ దగ్గరే ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న పుష్ప 2, విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్ 31, రామ్ చరణ్ –బుచ్చిబాబు సినిమాలు అన్నీ మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తోంది. ఇవి కాకుండా మరో ఐదు ప్రాజెక్టులు డిస్కషన్ దశలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక్క ఏడాదిలో దాదాపు రూ.500 కోట్ల పైనే సినిమాలు చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్.