జార్ఖండ్ మైనింగ్ కేసులో ఈడీ కార్యాచరణ ప్రారంభం

తనకు తానే మైనింగ్ కాంట్రాక్టులు కేటాయించుకున్న కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై హీట్ పెరుగుతోంది.సమన్లకు స్పందించి హాజరు కాకుండా తప్పించుకుంటున్న సోరెన్ పనిపట్టాలని ఈడీ నిర్ణయించుకుంది. తాను పదవి నుంచి వైదొలిగి భార్యను సీఎం పీఠంపై కూర్చొబెట్టాలని సోరెన్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే ఈడీ ప్రత్యక్ష కార్యచరణకు దిగింది.

సీఎం ప్రెస్ సెక్రటరీ సహా పలువురిపై దాడులు

జార్ఖండ్ మైనింగ్ లో రూ.100 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తే హేమంత్ సోరెన్ తప్పించుకు తిరుగుతున్నారు. సమన్లు చట్టబద్దం కాదని సోరెన్ వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చిన తర్వాత కూడా ఆయన ఈడీ కార్యాలయానికి రావడం లేదు. దానితో రూటు మార్చిన ఈడీ అధికారులు సోరెన్ అనుచరులు, ఆంతరంగికులపై దాడులు, సోదాలు మొదలు పెట్టింది. బుధవారం ఉదయం జార్ఖండ్, రాజస్థాన్లోని పది చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి..వారిలో ముఖ్యమంత్రి మీడియా సలహాదారుగా ఉన్న అభిషేక్ ప్రసాద్ అలియాస్ పింటూ కూడా ఉన్నారు..

ఐఏఎస్ అధికారులపై ఈడీ నజర్

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద సోరెన్ అనుయాయులపై దాడులు జరుగుతున్నాయి. రాజస్థాన్లోని షాహిబ్గంజ్ డిప్యూటీ కలెక్టర్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లి సోదాలు జరిపారు. గతంలో ఆయన జార్ఖండ్ లో పనిచేశారు. అదే విధంగా మైనింగ్ వ్యాపారంలో సలహాదారులైన ఆర్కిటెక్ట్ సోదరులు వినోద్ కుమార్, ఖోడానియా కుమార్ నివాసాలపై కూడా దాడులు జరిగాయి. జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే పప్పు యాదవ్ నివాసం దేవగరాలో ఉంది. ఈడీ అధికారులు అక్కడకు కూడా వెళ్లారు.మైనింగ్ స్కామ్ లో ఆయనకున్న లింకులను ఆరా తీస్తున్నారు. హజారీబాగ్ డీఎస్పీ రాజేంద్ర దుబే, కోల్ కతాకు చెందిన అభయ్ సారోగీపై కూడా దాడులు జరిగాయి. మైనింగ్ సొమ్మును ఎవరు తినేశారు…ఎవరికి ఎంత అందిందనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు..

సోరెన్ బాటలో కేజ్రీవాల్..

హేమంత్ సోరెన్ తరహాలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ సమన్లను ధిక్కరించారు. బుధవారం ఆయన ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉండగా కేజ్రీవాల్ వెళ్లడం లేదని పార్టీ వర్గాలు తెలిపారు. ఆయన ఈడీ విచారణకు సహకరిస్తారని వెల్లడించాయి. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ స్పందించకపోవడం ఇదీ మూడో సారి. కేజ్రీవాల్ ను అరెస్టు చేసి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఈడీ అడ్డుకోవాలని చూస్తోందని అటువంటి చర్యలను అనుమతించే ప్రసక్తే లేదని ఆప్ వర్గాలు అంటున్నాయి.దీనితో కేజ్రీవాల్ భయపడి పారిపోతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇంతకముందు డిసెంబరు 21న హాజరు కావాలని ఆయనకు నోటీసులు పంపగా, విపాసన యోగా కార్యక్రమానికి వెళ్తున్నానని చెబుతూ కేజ్రీవాల్ హాజరు నుంచి తప్పించుకున్నారు.