అప్పట్లో గుమ్మడి కాయతో సూప్, కూర, స్వీట్ చేసుకుని తినేవారు. ఇంకా గుమ్మడికాయతో వెరైటీ వంటకాలు చేసేవారు. కానీ ఇప్పుడు గుమ్మడికాయ వాడుతున్న వారి సంఖ్య తక్కువే. పైగా గుమ్మడికాయ వాడి ఆ గింజలు తీసి పడేస్తుంటారు. కానీ గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యం కోసం తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి కూడా ఒకటి. చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి. చాలా రుచిగా ఉండే ఈ గింజలు తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అయితే ఆరోగ్యానికి మంచివి కదా అని అతిగా తినకూడదంటారు ఆరోగ్యనిపుణులు.
గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. స్త్రీలల్లో రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో ప్రోస్టేస్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. వీటిలో ఫాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అందుకే ఈ గింజలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పైగా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి చెడుకొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతుంది. పురుషుల్లో వీర్యకణాలు పెంచేందుకు, గర్భిణీలకు అవసరమైన పోషకాలు అందించేందుకు గుమ్మడి గింజలు సహాయపడతాయి. నిద్రలేమితో బాధపడేవారికి, బరువు తగ్గాలి అనుకునేవారికి, జుట్టు పెరిగిందుకు, షుగర్ కంట్రోల్ అయ్యేందుకు ఇలా చాలా సమస్యలకు ఇవో చక్కని పరిష్కారం.
అతిగా తింటే ఇబ్బందులు తప్పవు
ఈ గుమ్మడి గింజలను రోజూ అర కప్పు మోతాదులో తీసుకోవచ్చు. అలాగే వీటిని ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో కూడా తీసుకోవచ్చు. ఈ గింజలను పచ్చిగా తినలేని వారు దోరగా వేయించి తిన్నా పోషకాలు అలాగే ఉంటాయి. అయితే శరీరానికి మేలు చేసేవే అయినప్పటికి ఈ గుమ్మడి గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. తగిన మోతాదులో తింటే బరువు తగ్గినట్టే..తినాల్సిన వాటికన్నా ఎక్కువ తింటే బరువు పెరిగే సూచనలూ ఉన్నాయి. “అతి సర్వత్ర వర్జయేత్“ అని అందుకే అంటారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం