కశ్మీర్లో 10 % శాతం మంది డ్రగ్ వాడకం – పాకిస్థాన్ పనేనా…

జమ్మూకశ్మీర్ లో శాంతి స్థాపనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. జనం హింసామార్గాన్ని వదిలి శాంతియుత సహజీవనానికి ఇష్టపడుతున్నారు. కశ్మీర్ పండిట్లలో కూడా ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతోంది. క్రమంగా వారు తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇంత జరుగుతున్న ఒకటి రెండు సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. అందులో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు…

13.50 లక్షల మందికి మాదక ద్రవ్యాల అలవాటు

సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్టాటింగ్ కమిటీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం జమ్మూకశ్మీర్లో 13.50 లక్షల మంది మాదక ద్రవ్యాల వినియోగదారులున్నారు. అది రాష్ట్ర జనాభాలో 10.8 శాతంగా గుర్తించారు. 18 నుంచి 75 సంవత్సరాల వయసు వారు ఈ డ్రగ్స్ వాడుతున్నారు. 2018 జమ్మూకశ్మీర్ జనాభా ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించినట్లు 27 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీ ప్రకటించింది. 10 నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లల్లో 1,68,700 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ అయ్యింది. 18 నుంచి 75 ఏళ్ల వయసులో దాదాపు 12 లక్షల మంది డ్రగ్స్ వాడుతున్నారు.

విమానాశ్రయాలు, సరిహద్దుల్లో నిఘా అవసరం

జమ్మూ కశ్మీర్ జనాభా కోటి 25 లక్షలు దాటింది. 4.47 లక్షల మంది గంజా ఆధారిత డ్రగ్స్ వాడుతున్నట్లు నివేదిక చెబుతోంది. ఇక వేర్వేరు రకాలుగా డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తున్నాయి. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ , నేపాల్ మార్గంలో వచ్చే డ్రగ్స్ ఎక్కువేనని గుర్తించారు. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి ఎక్కువ స్మగ్లింగ్ అవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోకి డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుంచి జారవిడుస్తున్న డ్రగ్స్ ను ఆ రాష్ట్రంతో పాటు కశ్మీర్లో ఎక్కువ పంపిణీ చేస్తున్నారు. అందుకే విమానాశ్రయాలతో పాటు సరిహద్దు నిఘా పెంచాలని సూచిస్తున్నారు. సరిహద్దుల్లో పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అత్యాధునిక నిఘా టెక్నాలజీ వాడితే డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకునే వీలుంటుంది.

గ్రామాలకు కలర్ కోడింగ్..
డ్రగ్స్ వినియోగాన్ని, సరఫరాలను నియంత్రించే దిశగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మత పెద్దలు సామాజిక కార్యకర్తల సహకారంతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలుత కింది స్థాయి నుంచి నరుక్కు రావాలన్న ఉద్దేశంతో గ్రామాలపై దృష్టి పెట్టింది. డ్రగ్స్ వినియోగం ఆధారంగా గ్రామాలకు ఆకుపట్ట, పసుపు, ఎరుపు రూపంలో కలర్ కోడింగ్ ఇస్తున్నారు. ఎక్కువ డ్రగ్స్ వినియోగం ఉన్న గ్రామాలకు రెడ్ కలర్ కోడింగ్ ఇచ్చి అక్కడి ప్రజలను సంస్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఏదోక శాఖను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎందుకంటే ఖాళీగా ఉన్న భవనాలను డ్రగ్స్ వినియోగదారులు తమ కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. మరో పక్క డ్రగ్స్ వినియోగదారులు ప్రతీ నెల ఆ పని కోసం రూ. 88,183 వ్యయం చేస్తున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి