ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మూలికలల్లో సుగంధ పాల వేర్లు కూడా ఒకటి. వేసవిలో శరీరానికి చలువ చేయడానికి షర్బత్ ల తయారీలో దీనిని వినియోగిస్తుంటారు. శరీరానికి చలువ చేయడంతో పాటు సుగంధ పాల వేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
ఆయుర్వేద మందుల తయారీలో సుగంధి
ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించే మొక్కల్లో సుగంధి పాల మొక్క ఒకటి. చాలా అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సుగంధి పాల మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు దీనిని విరివిరిగా ఔషధంగా వాడేవారు. ఈ మొక్క సుమారు 6 మీటర్ల వరకు పెరుగుతుంది. సుగంధి పాల మొక్క చక్కని సువాసనను కలిగి ఉంటుంది.
సుగంధి వేర్లతో కషాయం
సుగంధ పాల వేర్లు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. ఇవి నల్ల సుగంధి, ఎర్ర సుగంధి, దేశీయ సుగంధి ఇలా అనేక రకాలు ఉంటాయి. ఈ సుగంధి వేర్లతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సుగంధ వేర్లతో కషాయాన్ని తయారు చేసుకోవడానికి మనం 4 లేదా 5 గ్రాముల సుగంధ వేర్ల బెరడు పొడి, 4 మిరియాలను, 2 యాలకులను, ఒక చిన్న అల్లం ముక్కను, 10 పుదీనా ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఓ గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసిఅందులో సుగంధ వేర్ల పొడి, అల్లం, మిరియాలు, యాలకులు వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత వడకట్టి అందులో పుదీనా ఆకులు, తేనె వేసి కలిపి తాగాలి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు సుగంధి కషాయం తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సుగంధి వేర్ల పొడిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సుగంధి వేర్లతో కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల మనం ఇన్పెక్షన్ లు తగ్గుతాయి. రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మూత్రాశయ ఇన్పెక్షన్ లు కూడా దరి చేరకుండా ఉంటాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.