బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై చిన్నచూపు – టీడీపీ, జనసేన పట్టించుకోవడం లేదా ?

ఏపీలో టీడీపీ , జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. జోరుగా ప్రచారం చేస్తున్నారు కానీ.. బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై మాత్రం ఎవరూ దృష్టి పెట్టడం లేదు. ఉమ్మడి ప్రచార వ్యూహం, ఇరు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం కేంద్ర పార్టీ దృష్టికి వెళ్లడంతో .. అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి ప్రచాం

బీజేపీ పోటీ చేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ లోపం ఉందని.. అందరినీ కదిలించాల్సిన అవసరం ఉందని చంద్రబాబుతో జరిగిన సమావేశంలో బీజేపీ కేంద్ర ప్రతినిధులు స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. బలమైన అభ్యర్థుల పేరుతో కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులకే అవకాశం ఇచ్చినా అలాంటి చోట్ల కూడా ప్రచారం విషయంలో సమన్వయం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే ప్రధాని మోదీ బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మోదీ షెడ్యూల్ ఇదే !

ప్రధాని ప్రచార సభలు, రోడ్ షోలు బీజేపీ అభ్యర్దులు పోటీ చేస్తున్న ప్రాంతాల్లోనే ఖరారు చేసారు. బీజేపీ ఏపీ నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ప్రధాని పర్యటనలో భాగంగా మే 3వతేదీన పీలేరు, విజయవాడ పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2.45 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. పీలేరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం. కిరణ్ ప్రస్తుతం రాజంపేట ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. పీలేరు నుంచి కిరణ్ సోదరుడు కిషోర్ పోటీలో ఉన్నారు. అక్కడ మెజార్టీ ఓట్లు దక్కించుకుంటే ఎంపీ స్థానం గెలిచే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా పీలేరులో ప్రధాని పర్యటన ఎంపిక చేసారు.

విజయవాడలో రోడ్ షో

విజయవాడలో సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. అక్కడ రోడ్ షోకు నిర్ణయించారు. 4వ తేదీన రాజమండ్రి ,అనకాపల్లి లోప్రధాని మోదీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటించి రోడ్ షోలు నిర్వహిస్తారు. రాజమండ్రి నుంచి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు . మోదీ పర్యటన అనంతరం, కేంద్రం నుంచి మరికొందరు నేతలు ఏపీలో ప్రచారం చేస్తారు.