శుక్రవారం రోజు చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా శుక్రవారాన్ని భావిస్తారు. అందుకే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అనుసరిస్తారు. ఇంత ప్రత్యేకమైన ఈ రోజున పాటించాల్సిన నియమాలతో పాటూ చేయకూడని కొన్ని పనులుంటాయి. అవేంటో చూద్దాం.
లక్ష్మీదేవిని ఆరాధించే శుక్రవారం రోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. అదే సమయంలో శుక్రవారం అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి కూడా తెలుసుకోవాలంటారు పండితులు.
శుక్రవారం చేయకూడని పనులు
శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫొటోను కానీ దేవుడి మందిరంలోంచి బయటకు తీయరాదు. కొంతమంది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు. పాత విగ్రహాన్ని మరిచిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయరాదు.కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ పాతది మాత్రం శుక్రవారం తీయరాదు. శుక్రవారం రోజు అప్పు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. ఎవరికైనా సహాయం అవసరం అయితే చేయండి కానీ రుణం రూపంలో ఇచ్చి పుచ్చుకోవడాలు వద్దు. ఈ రోజు లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫొటో కానీ ఎవ్వరికీ ఇవ్వకండి. విగ్రహాన్ని ఇంటికి తీసుకురావొచ్చు కానీ తీసుకెళ్లి ఇవ్వొద్దు. పొరపాటున కూడా అమ్మవారి ప్రతిమ శుక్రవారం రోజు మీ ఇంటి గడప దాటరాదు. మరీ ముఖ్యంగా శుక్రవారం రోజు బూజులు దులపడం చేయరాదు. మగవారైనా ఆడవారైనా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం లాంటివి చేస్తే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదని చెబుతారు పండితులు. ఇంకా మాసిన బట్టుల ధరించడం, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టడం చేయద్దంటారు.
శుక్రవారం రోజు పాటించాల్సిన విధులు
శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజు దానధర్మాలు చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువుంటుందని పండితుల మాట. శాస్త్రాల ప్రకారం సంధ్యాసమయంలో కొంతసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలి, వెనుక ద్వారం మూసివేసి ఉండాలని చెబుతారు. ఆ సమయంలో అమ్మవారు ఇంట్లోకి అడుగుపెడుతుందని విశ్వాసం. శుక్రవారం రోజు తులసి మొక్క దగ్గర తప్పనిసరిగా దీపం వెలిగిస్తే సుమంగళి యోగం లభిస్తుందని పండితుల విశ్వాసం. అమ్మవారికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది
పాలతో పాయసం చేసి నివేదించాలి అయితే ఈ పాయసం ఇంటికొచ్చిన వారికి పెట్టొచ్చు కానీ ఇల్లు దాటి బయటకు ఇవ్వరాదు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం