కాంగ్రెస్ నేతకు కుక్క బిస్కెట్లు..

కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీ. ఆ పార్టీకి జనం, ప్రజాస్వామ్యం కంటే సోనియా కుటుంబమే ముఖ్యం. అవసరమైతే సోనియా కుటుంబ సభ్యుల చెప్పుల మోయడానికి కూడా కాంగ్రెస్ నేతలు వెనుకాడరని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. సోనియా కుటుంబం మెప్పు కోసం కార్యకర్తలు, నేతలు ఏ పనైనా చేస్తారు. ఈ మధ్య కాలంలో మారామని ఆత్మాభిమానంతో ఉంటున్నామని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ అది నిజం కాదని వరుస సంఘటనలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మారాలని ప్రయత్నించినా సోనియా కుటుంబం అందుకు ఒప్పుకోదు. వారిని బానిసలుగానే చూస్తుంది….

కుక్కకు పెట్టిన ప్లేట్ నుంచి కాంగ్రెస్ నేతకు…

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు భారతో జోడో న్యాయ్ యాత్రలో ఊరురా తిరుగుతున్నారు. ఆ సందర్భంగా ఆయన అహంకారపూరితంగా చేసిన ఒక పని ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జీ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. “కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే .. బూత్ స్థాయి ఏజెంట్లను కుక్కలతో పోల్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తినిపిస్తూ కనిపించారు. ఆ బిస్కెట్లను కుక్క తినకపోవడంతో ఆ ప్లేట్ లో ఉన్న వాటినే కాంగ్రెస్ కింది స్థాయి నేత ఒకరికి తినిపించారు. కాంగ్రెస్ యువరాజు తమ కార్యకర్తలను కుక్కలుగా చూస్తే, సహజంగానే ఆ పార్టీ అంతర్థానం కావడం ఖాయం”, అని అమిత్ మాలవీయ ఎక్స్ (ఒకప్పటి ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

గతంలో సంఘటనలను గుర్తుచేస్తున్న బీజేపీ…

బీజేపీకి చెందిన మరో నాయకురాలు సీటీ పల్లవి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సోనియాగాంధీ కుటుంబం ఉచ్చనీచాలు మరిచి సిగ్గులేకుండా ప్రవర్తిస్తుందని ఆమె అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ నేత ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మకు కూడా రాహుల్ గాంధీ తన కుక్క (కుక్క పేరు పిడీ) తినే ప్లేటులో ఉన్న బిస్కెట్లు పెట్టేందుకు ప్రయత్నించారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు కుక్క తినేందుకు తిరస్కరించిన బిస్కెట్లను కాంగ్రెస్ కార్యకర్తలకు పెట్టాలని చూశారన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారులు, ఓటర్లపై కాంగ్రెస్ నేతలకు ఉన్న గౌరవ మర్యాదలు అలాంటివని ఆమె ప్రస్తావించారు.

వాళ్లని ఎదిరించే వచ్చానంటున్న హిమంత…

తాజా పరిణామాలపై అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ స్పందించారు. రాహుల్ ఒక్కడే కాదు.. వాళ్ల కుటుంబం మొత్తం ఏకమైనా తనతో కుక్క బిస్కెట్లు తినిపించలేరని ఆయన బదులిచ్చారు. వాళ్లు ప్రవర్తనను అసహ్యించుకునే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్నారు. తాను గౌరవ మర్యాదలతో బతికే అసోం పౌరుడినని ఎవరి కుక్క బిస్కెట్లకు ఆశపడనని ఆయన చెప్పుకున్నారు. నిజానికి హిమంత బిశ్వా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఓ సారి రాహుల్ ను కలిసేందుకు వెళ్లారు. అప్పుడు హిమంతతో మాట్లాడకుండా రాహుల్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్నారు. కాసేపు చూసి విసుగుచెందిన హిమంత బయటకు వచ్చేసి… బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు అసోం సీఎంగా మంచి పేరు తెచ్చుకున్నారు.