టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు టిక్కెట్ టెన్షన్ పట్టుకుంది. ఆమె పార్టీలో కీలకమైన పొజిషన్ లో ఉన్నా సొంత నియోజకవర్గంలో మాత్రం వ్యతిరేకత కనిపిస్తోంది. టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత… పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కొత్తగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పాయకరావుపేటలో మాత్రం అందరి ఆమోదం పొందలేకపోతున్నారు.
మళ్లీ పాయకరావుపేట ఇంచార్జ్ పదవి
గతంలో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పార్టీ నేతల వ్యతిరేకతతో చివరికి.. కొవ్వూరుకు మార్చారు. అక్కడ ఓడిపోవడంతో ఆఆమెకు పార్టీ అధినేత చంద్రబాబు మరో అవకాశం కల్పించారు. గతంలో ఆమె ఎమ్మెల్యేగా వ్యవహరించిన విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ ఇంఛార్జ్ పదవిని తిరిగి అనితకు అప్పగించారు. కానీ ఆమెను పార్టీ నేతలు అంగీకిరంచడం లేదు. ఆ అసంతృప్తి అలా కొనసాగుతూనే ఉంది.
ఎమ్మెల్యేగా ఉండి అందర్నీ కలుపుకుని పోలేకపోయిన అనిత
2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించిన వంగలపూడి అనితకు గత ఎన్నికల్లో స్థానచలనం కలిగించారు చంద్రబాబు. ఆమెకు సిట్టింగ్ సీటు పాయకరావుపేట కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీటును కేటాయించారు. దీనికి కారణం ఎమ్మెల్యేగా అండి అందర్నీ కలుపుకుని పోలేకపోవడమే. పాయకరావుపేటను బంగారయ్యకు కేటాయించారు. అయితే ఆయన గత ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చవిచూశారు. తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు.
పార్టీ కోసం చురుకుగా పని చేస్తున్న అనిత
టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిత… వైసీపీపై రాజకీయ దాడి చేయడంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో తన పాత సిట్టింగ్ సీటును మళ్లీ కేటాయించాలని చంద్రబాబును కోరారు. ఆమె అభ్యర్థనను అంగీకరించిన చంద్రబాబు… మళ్లీ పాయకరావుపేట ఇంఛార్జ్‌గా అనితకు అవకాశం ఇచ్చారు. అయితే టిక్కెట్ ఖరారు విషయంలో మాత్రం అనేక సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే టిక్కెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ లో అనిత ఉన్నారు.