ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనేక కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రగాల్భాలు పలికిన నేతలే ఇప్పుడు అసలు అవినీతిపరులని తేలిపోతోంది. రూ.100 కోట్లు కుంభకోణం కేసు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతోంది. ఆప్ పార్టీ నుంచి వరుస అరెస్టులు సంభవించడం ఈ కేసులో విశేషం.
పోస్టర్లు వేసిన సంజయ్
తాను కడిగిన ముత్యం లాంటి వాడినని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తరచూ చెబుతుండేవారు. తనకు స్కామ్ కు ఎలాంటి సంబంధమూ లేదని, అసలు స్కామే జరగలేదని సంజయ్ సింగ్ వాదించేవారు. పైగా తన ఇంట్లో ఎప్పుడైనా రైడ్స్ చేసుకోవచ్చంటూ… వెల్కం టు ఈడీ అని తన ఇంటిబయట సంజయ్ సింగ్ పోస్టర్లు కూడా వేశారు. సంజయ్ సింగ్ ఇంటిపై బుధవారం రెయిడ్ నిర్వహించినప్పుడు మాత్రం కీలక దస్తావేజులు దొరికాయి. పైగా విచారణలో ఆయన ఎలాంటి సమాచారమూ ఇవ్వడం లేదు. దానితో ఈడి ఆయన్ను అరెస్టు చేయాల్సి వచ్చింది. తర్వలో సీబీఐ కూడా రంగంలోకి దిగే వీలుంది. ఈ కేసులో అరెస్టయినా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఎన్ని సార్లు ప్రయత్నించినా కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడం లేదు.
దినేష్ అరోరా వాగ్మూలమే కీలకం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో పలువురు అప్రూవర్లుగా మారుతున్నారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డితో పాటు మద్యం వ్యాపారి దినేష్ అరోరా కూడా అప్రూవర్లుగా మారారు. దినేష్ అరోరాను ఈడీ విచారించినప్పుడు కీలక సమాచారం వారికి అందింది. దాని ఆదారంగానే స్కామ్ లో సంజయ్ సింగ్ లింకులు బయట పడ్డాయి. జైల్లో ఉన్న మనీష్ సిసోడియా, దినేష్ అరోరాకు మీటింగ్ ఏర్పాటు చేసినదే సంజయ్ సింగ్ అని తేలడంతో ఆయన నివాసంపై రైడ్స్ నిర్వహించాల్సి వచ్చిందని ఈడీ అధికారులు చెబుతున్నారు. స్కామ్ లో వచ్చిన డబ్బులో అధికభాగం సంజయ్ సింగ్ తన దగ్గర దాచారని కూడా దినేష్ అరోరా వెల్లడించారు. దానితో ఆయనపై మనీ లాండరింగ్ అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
పరస్పర ఆరోపణలు
సంజయ్ సింగ్ అరెస్టు తర్వాత ఇండియా గ్రూపు, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆప్ ను దారికి తెచ్చుకునేందుకే వరుస అరెస్టుకు చేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. బీజేపీతో చేరేందుకు అంగీకరిస్తే అన్ని కేసులు పోతాయని ఆయన వాదిస్తున్నారు. ఈడీ వెయ్యి రైడ్లు చేసినా ఒక్క పైసా సాక్ష్యం దొరకలేదని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేతల ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరో పక్క దేశంలో ఇకనైనా అవినీతిపోవాలని బీజేపీ అంటోంది. అవినీతిపరుల భరతం పట్టేందుకు మహాత్మాగాంధీ ఆశీస్సులు కోరుతూ రాజ్ ఘాట్ వద్ద ఢిల్లీ బీజేపీ నేతలు ప్రార్థనలు చేశారు.