రాహుల్ గాంధీకి ఉదయానికి సాయంత్రానికి తేడా తేలీదా..?

రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ను, దేశాన్ని ఏలే సత్తా ఉందా. జనంపై సమ్మోహనాస్త్రాలు సంధించే తెలివితేటలు ఉన్నాయా. రాజకీయాల్లో ఎంటరైనప్పటి నుంచి ఆయన సరైన మార్గంలోనే నడుస్తున్నారా.దీనిపై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయాలేమిటి. ఆయన కుమార్తె షర్మిష్టా ముఖర్జీ రాసిన ప్రణబ్ మై ఫాదర్ పుస్తకంలో రాహుల్ గురించిన ప్రస్తావనలేమిటి…

రాహుల్ వెళ్లిన వేళ

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత ఓసారి రాహుల్ గాంధీ ఆయన్ను కలిసేందుకు వెళ్లారు. ఉదయం మొఘల్ గార్డెన్స్ (అమృత్ ఉద్యాన్)లో ప్రణబ్ వాకింగ్ చేస్తుండగా రాహుల్ రావడంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. వాకింగ్, పూజ సమయంలో ఎవరూ తనను కదిలించకూడదని ప్రణబ్ అనుకుంటారు. కాకపోతే వచ్చినదీ రాహుల్ కావడంతో ఆయన తన వాకింగ్ ను సగంలో ఆపేసి మీటింగుకు కూర్చున్నారు. మీటింగ్ సందర్భంగా రాహుల్ గాంధీ కార్యాలయం చేసిన తప్పిదం అర్థమైంది. తాను రాహుల్ కు సాయంత్రం అప్పాయింట్ మెంట్ ఇస్తే ఆయన కార్యాలయం దాన్ని ఉదయంగా భావించి రాహుల్ కు చెప్పినందునే తన వాకింగ్ టైమ్ లో వచ్చారని ప్రణబ్ అర్థమైంది. ఏఎంకు, పీఎంకు తేడా తెలియని స్టాఫ్ తో రాహుల్ ఎలా నెగ్గుకువస్తున్నారని, ఆయన రాజకీయాల్లో రాణించాలని ఎలా అనుకుంటున్నారని ప్రణబ్ తన కుమార్తె షర్మిష్టా వద్ద ప్రస్తావించారట..

వ్యవస్థాపక దినోత్సవానికి హాజరు కాని రాహుల్…

ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. మూడు తరాల గాంధీ కుటుంబీకులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. సాధారణ నాయకుడి నుంచి అత్యున్నత రాష్ట్రపతి పదవి వరకు ఎదిగారాయన. రాహుల్ గాంధీ చిత్తుశుద్ధిపై ఆయన ఒకటి రెండు సార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2014 డిసెంబరు 28న జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాహుల్ కనిపించలేదని ప్రణబ్ గుర్తుచేశారు. ఏఐసీసీ కార్యాలయానికి రాని నాయకుడు జనంలో ఎలా ఉంటారని ప్రణబ్ ఆశ్చర్యపోయారట. కష్టపడకుండా సులభంగా వచ్చిన అవకాశాలను రాహుల్ వినియోగించుకోవడం లేదని ప్రణబ్ ఆందోళన చెందేవారట. కుమారుడిని వారసుడిగా నిలబెట్టాలని సోనియా ప్రయత్నిస్తున్నారని, రాహుల్ కు అంత కరిష్మా లేదని, రాజకీయ అవగాహన లేకపోవడంతో రాహుల్ తప్పటడుగులు వేస్తూ నవ్వుల పాలవుతున్నారని ప్రణబ్ అభిప్రాయం.

తరచూ మాయమయ్యే రాహుల్…

రాజకీయాల్లో రాణించాలనుకున్న నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండాలి.రాహుల్ మాత్రం రోజుల తరబడి మాయవుతుంటారు. పార్టీకి అండగా ఉండాల్సిన కీలక సమయాల్లో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోవడం సహేతుకం కాదన్నది ప్రణబ్ అభిప్రాయం. అలా తరచూ బ్రేక్ తీసుకోవడం వల్ల కీలకాంశాలపై రాహుల్ కు అవగాహన లేకుండా పోయిందని ప్రణబ్ వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. పార్టీపై పట్టు కూడా కోల్పోయారని ప్రణబ్ చెబుతుండేవారట. అయితే ప్రణబ్ ఇప్పటి వరకు బతికి ఉంటే… భారత్ జోడో యాత్రలో రాహుల్ కు వచ్చిన స్పందన, పరిణితి చెందిన నాయకుడిగా ఆయన కనిపించి తీరును చూసి మెచ్చుకునే వారని షర్మిష్టా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలపైన, రాహుల్ గాంధీ తీరుపైనా ప్రణబ్ ఇంకేమేమి అన్నారో తెలుసుకోవాలంటే మాత్రం షర్మిష్టా రాసిన ప్రణబ్ మై ఫాదర్ పుస్తకం చదవాల్సిందే.