అచ్చెన్నాయుడికి అలా కలసి వస్తోందా ? వైసీపీ అభ్యర్థి ఇంట్లో ఫ్యామిలీ గొడవలు.. పేరు మారిపోయింది !

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి రాజకీయంగా అలా కలసి వస్తోంది. ఆయనపై పోటీ చేయాలనుకునే ప్రత్యర్థులు తప్పిదాలతో ఆయన బయటపడిపోతున్నారు. ఈ సారి కూడా అలాంటి లక్ ఏదో కలసి వస్తోంది. సీఎం జగన్ రెండు సార్లు వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శీనును ప్రకటించారు. కానీ ఆయన ఇంట్లో గొడవలతో.. ఆయన భార్యను అభ్యర్థిగా మార్చాల్సి వచ్చింది.

దువ్వాడ దూకుడుకు భార్య బ్రేక్

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడుపై దూకుడుగా వెళ్లే్ లీడర్ దువ్వాడ శ్రీనివాస్. ఆయనకు చివరికి టిక్కెట్ లేకుండా పోయింది. ఆయనే అభ్యర్థి అని జగన్ .. టెక్కలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో చెప్పారు.. మూలపేట పోర్టు శంకుస్థాపనలో చెప్పారు. అయినా సరే సీన్ మారిపోయింది. కొద్ది రోజుల కిందట స్వయంగా దువ్వాడ శ్రీనివాసే ప్రెస్ మీట్ పెట్టి ..తాను కాదు తన భార్య పోటీ చేస్తున్నారని ప్రకటించాల్సి వచ్చింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి కుడితిలో ఎలకలా అయిపోయింది. అయితే ఇదంతా రాజకీయ సమీకరణాల్లో చేయలేదు. ఆయన భార్య ఆయనపై తిరుగుబాటు చేసి.. హైకమాండ్ కు ఫిర్యాదులు చేసి.. తానే అభ్యర్థిగా బలవంతంగా ప్రకటింప చేసుకున్నారు.

జగన్ కు ఆత్మీయడు దువ్వాడ శ్రీనివాస్

అచ్చెన్నాయుడుపై పోరాటం ద్వారా సీఎం జగన్ మెప్పు పొందారు దువ్వాడ శ్రీనివాస్. నియోజకవర్గంలో అందరూ ఆయనను వ్యతిరేకించినా అచ్చెన్నాయుడు పై మాటల దాడిని జగన్ మెచ్చడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. జిల్లాలో చాలా వరకూ చక్రం తిప్పారు. అయితే ఆయన ఓ మహిళ తో వివాహేతర బంధంలో చిక్కుకున్నారన్న ఆరోపణలు రావడంతో సీన్ మారిపోయింది. ఆ మహిళ చెప్పినట్లే జిల్లాలో అధికారుల పోస్టింగ్‌లు..ఇతర పనులు చేయిస్తున్నారు దువ్వాడ. ఈ వ్యవహారం ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టింది. దువ్వాడ వివాహేతర బంధం సాక్ష్యాలతో సహా ఆయన భార్య దువ్వాడ వాణి దగ్గరకు చేరడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా మారకపోవడంతో.. ఇక దువ్వాడ సతీమణినే రంగంలోకి దిగారంటున్నారు.

జడ్పీటీసీగా ఉన్న దువ్వాడ భార్య

జడ్పీటీసీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి… .. వైసీపీ హైకమాండ్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇవ్వాలని పట్టుబట్టారు. లేకపోతే మీడియా ముందు తన భర్త బాగోతాన్ని బయట పెడతానని హెచ్చరించినట్లుగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరరుగుతోంది. ఈ విషయం గోల గోల కావడంతో హైకమాండ్ రాజీ చేసే ప్రయత్నం చేసింది. కొన్నాళ్ల కిందట ఇద్దరూ ప్రెస్ మీట్ పెట్టి.. మా మధ్య గొడవల్లేవని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా దువ్వాడ శ్రీను మారకపోవడంతో.. ఆమె ఫైనల్ అల్టిమేటం ఇచ్చారు. చివరికి ఈ గోల ఎందుకని..దువ్వాడ వాణినే అభ్యర్థిగా ఖరారు చేసినట్లగా తెలుస్తోంది. ఎన్నికల నాటికి పరిస్థితులు ఏమైనా మారుతాయో లేదో కానీ ఇప్పుడు మాత్రం దవ్వాడ ఇంట్లోని వాళ్ల చేతుల్లో ఓడిపోయారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.