అందానికి మెరుగులు దిద్దుకోవడంలో భాగంగా మేకప్ వేసేవారి సంఖ్య ఎక్కువే. లైట్ గా టచప్ ఇచ్చినా కానీ తప్పనిసరిగా లిప్ స్టిక్ వినియోగిస్తుంటారు. కొందరైతే పెదాలకు లిప్ స్టిక్ వేయకుండా ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టరు. ఇంతకీ లిప్ స్టిక్ ఎంత ప్రమాదమో తెలుసా..
మహిళలకు-లిప్ స్టిక్ కి విడదీయరాని అనుబంధం. కొందరు అకేషనల్ గా లిప్ స్టిక్ వినియోగిస్తే మరికొందరు నిత్యం పెదాలకు రంగు లేనిదే బయట అడుగుపెట్టరు. అసలు మీరు వాడుతున్న లిప్ స్టిక్ లో ఏముందో తెలుసా? ఎన్ని రకాల జబ్బులు మాటువేసి ఉన్నాయో ఊహించగలరా? అందమైన పెదాలకు రంగుల రూపంలో రసాయనాలు అద్దుతున్నారని మీకు తెలుసా?. అందం మాట దేవుడెరుగు లిప్ స్టిక్ వల్ల నష్టం తెలిస్తే జన్మలో దాని జోలికి పోరు.
లిప్ స్టిక్స్లో ప్రమాదకర కెమికల్స్ – దాన్నుంచి వచ్చే రోగాలు ఇవే
లిప్ స్టిక్ లో లెడ్, పెట్రో కెమికల్స్, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి..ఫలితంగా ఈ కెమికల్స్ పెదవుల నుంచి శరీరంలోకి చేరుకుంటాయి. వీటిలో కాడ్మియం ఎక్కువగా చేరితే మూత్రపిండాలు చెడిపోతాయి, కడుపులో కణితులూ రావచ్చు. లెడ్ లోపలకెళితే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించడంతో పాటూ మెదడుకి నష్టం చేకూర్చుతుంది. కేవలం లెడ్ కారణంగా హార్మోన్ అసమతుల్యత, వంధత్వం బారిన పడతారు. ఇంకా లిప్ స్టిక్ లో క్యాన్సర్ కారక పదార్థాలుంటాయి..ఇవి పునరుత్పత్తి, ఎదుగుదల, తెలివితేటలపై ప్రభావం చూపిస్తుంది. శ్వాసలో గురక, దగ్గు, కళ్ళలో, చర్మంపై ఇరిటేషన్ వంటివి ఫార్మాల్డిహైడ్ వలన కలిగే ఇతర ప్రభావాలు. పారాబెన్స్, బిస్మత్ ఆక్సీ క్లోరైడ్ కూడా లిప్స్టిక్ తయారీలో ఉపయోగిస్తారు. ఇవి కూడా క్యాన్సర్ కారకాలు
బ్రాండెడ్ అయినా లో క్వాలిటీ అయినా అంతే
తక్కువ ధరకు వస్తున్నాయని లో-క్వాలిటీ లిప్ స్టిక్స్ వాడకం ఒక్కోసారి మీ ప్రాణాలపైకి తెస్తుంది. ఈ లిప్ స్టిక్స్లో క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటి ఫలితంగా ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయి. శరీరంలోని అవయవాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. బ్రాండెడ్ అయినా తీవ్రత కాస్త తక్కువ ఉండొచ్చేమో కానీ సైడ్ ఎఫెక్టులు మాత్రం తప్పవంటున్నారు నిపుణులు.
అందంపై శ్రద్ధ ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు
అందంపై శ్రద్ధ ఉండడం మంచిదే కానీ దాన్ని మెరుగుపర్చుకోవాలనే తాపత్రయంలో రసాయనాలు కలసిన రంగులు మొహానికి, పెదవులకు వేస్తే లేని అనారోగ్యం కొనితెచ్చుకున్నట్టే. పైగా ఇవి వాడుతున్నప్పుడు కుందనపు బొమ్మలా స్కిన్ మెరవొచ్చు కానీ రాను రాను దానివల్ల ఇబ్బందులు బయటపడతాయి. అప్పుడు లేని అందం అద్దుకోవడం కాదు..ఉన్న లుక్ కూడా పోతుంది. అందుకే మీరు వినియోగిస్తున్న సౌందర్య సాధనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి మీకు అందాన్ని ఇస్తున్నాయో…అనారోగాన్ని ఇస్తున్నాయో గమనించండని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.