ఇప్పుడంటే ట్రెండ్ మారింది..కొత్త కొత్త అలవాట్లు పుట్టుకొచ్చాయి..మనది కాని జీవనశైలికి అలవాటు పడిపోయాం కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎప్పటికీ పాత పద్ధతులు పాటించడమే మంచిది. అలాంటి వాటిలో ఒకటి నేలపై కూర్చుని భోజనం చేయడం. అప్పట్లో వాళ్లకి కూర్చుకునేందుకు బల్లలు లేక కాదు.. కింద కూర్చుని అన్నాన్ని ఐదువేళ్లతో నోట్లో పెట్టుకుని తినడం వెనుకున్న అసలు కారణాలు వేరే…
నేలపై కూర్చుని భోజనం చేస్తే…
@ భోజనం చేసేందుకు కూర్చునే స్థితి ఓ ఆసనం. నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనం ఉపయోగపడుతుంది. అంటే భోజనం చేసే సమయంలో కూడా ఆసనంలోనే ఉంటాం అన్నమాట.
@ కూర్చుని తినడం వల్ల పొట్ట, ప్రతి ముద్దకీ…ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటుంది. ఒకటి- పొట్ట చేసేకదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. తగినంత ఆహారం తీసుకుని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. అంటే అవసరానికి మంచి తినలేం కాబట్టి కింద కూర్చుని తింటే మితాహారం తీసుకుంటాం.
@ చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. నిత్యం నేలపై కూర్చుని తినేవారు వృద్ధాప్యంలో కూడా ఒకరి సాయం లేకుండా కూర్చోగలకు, నిల్చోగలరు.
@ నేలమీద కూర్చుని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకూ ప్రతిభాగం కదులుతుంది. తొడల దగ్గర్నుంచీ ముడుచుకుని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీర పైభాగంలో కేంద్రీకృతమవుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె పనితీరుకి కూడా ఇది చాలా మేలుచేస్తుంది. కుర్చీల్లో కూర్చుని తింటే రక్త ప్రసరణ మొత్తం కాళ్లవైపుకి ప్రయాణిస్తుంది.
@ నేల మీద కూర్చుని తినడం, నేల మీద పడుకోవడం అంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండటమే. యోగశాస్త్రం పరంగా, ఆరోగ్యం పరంగా కూడా నేలపై కూర్చుని తినడం ఎంతో మంచిది. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడానికీ, జీర్ణం అయిన ఆహారం ఒంటపట్టడానికీ ఇవి సాయపడతాయి.
చేత్తోనే ఎందుకు తినాలి
చేత్తో అన్న తిన్నవాళ్లని అదోరకంగా చూస్తుంటారు.. పల్లెటూరి నుంచి వచ్చారనో, ట్రెండ్ ఫ్యాషన్ తెలియదనో హేళనగా చూస్తుంటారు.. కానీ నేలపై కూర్చుని తినడం, చేత్తోనే తినేవారు పొందే ప్రయోజనాలు వారికి తెలియకపోవడం వారి దురదృష్టం. ఎందుకంటే చేతికున్న ఒక్కో వేలిలో ఒక్కో తత్వం ఉంటుంది..
@ బొటనవేలు – అగ్నితత్వం
@ చూపుడు వేలు – వాయుతత్వం
@ మధ్యవేలు – ఆకాశం
@ ఉంగరపు వేలు – భూమి
@ చిటికెన వేలు – జలతత్వం
ఈ ఐదువేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం