జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో క్రీయాశీకలంగా వ్యవహరిస్తున్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేనాని అందుకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపై నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్న జనసేనాని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం కోసం ప్రత్యేక వాహానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఆ వాహనం పేరు ‘వారాహి’. అసలు వారాహి అంటే ఎవరు? ఈ పేరువెనుకున్న శక్తి రూపం గురించి తెలుసా? పవన్ కళ్యాణ్ తన వాహనానికి ఈ పేరు ఎందుకు పెట్టారు?
వారాహి అంటే ఎవరు?
పురాణాల గురించి తెలిసిన వారికి శ్రీ మహావిష్ణువు వరాహా అవతారాల గురించి తెలిసే ఉంటుంది. విష్ణువు దశవాతారాల్లో వరహ అవతారం ఒకటి. హిరణాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి..భూమిని సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి వేదాలను కాపాడి భూమిని ఉద్ధరిస్తాడు. ఈ వరాహస్వామి అర్థాంగి, వరాహస్వామి స్త్రీ తత్వమే ‘వారాహి’ అని చెబుతారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.
వారాహి రూపం
పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖం, పాశం, హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.
తాంత్రికులకు ఇష్టమైన దేవత
తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో వారాహిని పూజిస్తారు.వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.
సైన్యాధ్యక్షురాలు వారాహి
లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ నమ్మకం. ప్రతి మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో ఉంటూ మణిపూర, స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .
వారణాసికి గ్రామ దేవత వారాహి
వారాహి వారణాసికి గ్రామదేవత. కాశీలో ఉన్న వారాహి ఆలయానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లే వీలుండదు. భూ గర్భ గృహంలో ఉండే ఈ ఆలయం నిత్యం తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెలుతుందంట. ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేల పై రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి.. ఒక రంధ్రంలోనుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం..మరో రంధ్రం నుంచి అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిని కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు పండితులు. దుష్ట శక్తులను అణిచేసే వారాహి అమ్మవారి ఆలయం వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ కు ఎడమ వైపు ఉంటుంది .
దుష్ట సంహారం చేసి విజయాన్ని అందించే శక్తిరూపం కాబట్టే వారాహి అమ్మవారి పేరు జనసేనాని పవన్ కళ్యాణ్ తన ప్రచార వాహనానికి పెట్టుకున్నారు.