Travel Now Pay Later: పోస్ట్‌పెయిడ్‌ ట్రైన్ టికెట్స్ (ట్రావెల్‌ నౌ పే లేటర్‌) గురించి మీకు తెలుసా!

క్రెడిట్ కార్డులు తెలుసు, బ్యాంకు EMIలు తెలుసు, పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులు తెలుసు…మరి ఈ పోస్ట్ పెయిడ్ ట్రైన్ టికెట్స్ ఏంటి అంటారా.. ఇది రైలు ప్రయాణికులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. చేతిలో డబ్బులులేకపోయినా కచ్చితంగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుంది.

రైలు ప్రయాణం అన్నది మన దేశ ప్రజల జీవితాల్లో ఓ భాగం. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 13,169 ప్యాసింజర్ రైళ్లు ..7,325 స్టేషన్లను కలుపుతూ లక్షకు పైగా కిలోమీటర్లను కవర్ చేస్తూ నడుస్తున్నాయి.నిత్యం రెండున్నర కోట్లకు పైగా భారతీయులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైల్వేలో సగటున రోజుకు 5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. వీటిలో 55% టిక్కెట్లను రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో తీసుకుంటున్నవారైతే..37% టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. మిగిలిన 8% ఏజెంట్ల ద్వారా బుక్ అవుతున్నాయి. ఇప్పడు చెప్పబోయే ముఖ్య విషయం ఏంటంటే ఇకపై రైలు ప్రయాణం చేయాలి అనుకుంటే టికెట్ కొనుక్కునేందుకు మీ చేతిలో డబ్బుల్లేకపోయినా పర్వాలేదు.

ముందు ప్రయాణం చేయండి తర్వాత డబ్బులు చెల్లించండి (Travel Now Pay Later)
ప్రయాణీకులకు చేరువయ్యేందుకు కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) చేతిలో డబ్బులు లేకున్నా టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది. అంటే టికెట్ బుక్ చేసుకుని ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు…ఆ డబ్బులు తర్వాత చెల్లించవచ్చు..ఇదీ IRCTC తీసుకొచ్చిన కొత్త స్కీమ్‌. “ట్రావెల్‌ నౌ పే లేటర్‌” సదుపాయాన్ని ప్రయాణికులకు అందించడం కోసం క్యాష్‌ఈ, పేటీఎం, ఈపేలేటర్‌తో ఐఆర్‌సీటీసీ చేతులు కలిపింది. ‘క్యాష్‌ఈ’లో “ట్రావెల్‌ నౌ పే లేటర్‌” పేరిట ఈ సర్వీస్‌ కనిపిస్తుంది. పోస్ట్‌పెయిడ్‌ కింద పేటీఎంలో ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు.

పోస్ట్‌పెయిడ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలంటే
పేటీఎం…పోస్ట్‌పెయిడ్‌ ద్వారా తన యూజర్లకు 60 వేల రూపాయల వరకూ రుణం ఇస్తోంది. దీనిని ఉపయోగించుకుని ట్రైన్ టికెట్ బుక్‌ చేసుకోవచ్చు. 30 రోజుల లోపు ఆ డబ్బును తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఇవ్వక్కర్లేదు. ఒకవేళ చెల్లించలేకపోతే ఆ మొత్తాన్ని EMI రూపంలో మార్చుకోవచ్చు.
@ మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి
@ మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఫిల్ చేసి బుక్‌ టికెట్‌పై క్లిక్‌ చేయాలి
@ పేమెంట్‌ పేజీలో పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ను ఎంచుకోవాలి
@ ఇప్పుడు పేటీఎం పేజీ ఓపెన్‌ అవుతుంది
@ పేటీఎం లాగిన్‌ వివరాలతో మీరు ఆ పేజీలోకి లాగిన్‌ అవ్వాలి..అంతే..టికెట్‌ బుకింగ్‌ పూర్తయినట్లే
@ ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి చెల్లించవచ్చు..లేదంటే EMI గా మార్చుకోవచ్చు

క్యాష్‌ఈ ద్వారా ట్రైన్‌ టిక్కెట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలంటే
@ మీ దగ్గర IRCTC రైల్‌ కనెక్ట్‌ యాప్‌ ఉండాలి. దీనిని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
@ ఈ యాప్‌లోకి లాగిన్‌ అయ్యి, ప్రయాణ వివరాలు ఫిల్ చేసి బుక్‌ టికెట్‌పై క్లిక్‌ చేయాలి
@ పేమెంట్‌ పేజీలోకి వెళ్లగానే, ‘ట్రావెల్‌ నౌ పే లేటర్‌’ సెలెక్ట్ చేసుకుని అక్కడ క్యాష్‌ఈని సెలెక్ట్‌ చేస్తే టికెట్‌ బుకింగ్‌ పూర్తవుతుంది
@ ఈ మొత్తం డబ్బును గడువులోగా, లేదా EMI రూపంలో చెల్లించే వెసులుబాటు ఉంది.