గంగా నదిలో స్నానమాచరించడం పరమ పవిత్రం అని భావిస్తారు. అలాంటిది నవగంగలు కలిసిన పుష్కరిణిలో స్నానమాచరిస్తే ఇంకెంత పుణ్యమో కదా. నవగంగలు ఒకే దగ్గర కలవడం సాధ్యమా అంటే…సాధ్యమే అంటున్నారు పండితులు..అందుకు ఈ ప్రదేశమే సాక్ష్యం అని చెబుతున్నారు.
1.గంగ 2.యమున 3.సరస్వతి 4.నర్మద 5.గోదావరి 6.కావేరి 7.మహానది 8.పయోష్ణ 9.సరయు ఈ తొమ్మిది నదులని నవగంగలుగా చెబుతారు. ఈ నదులన్నీ పన్నెండేళ్ళకోసారి మహామఘం అనే పుష్కరిణిలో వచ్చి కలుస్తాయని ప్రతీతి. ఈ మహామఘం అనే పుష్కరిణి తమిళనాడు కుంభకోణం అనే పట్టణంలో ఉంది. ద్వాపరయుగం అంతమయ్యే కాలంలో ఆకాశంలో వెళ్తున్న అమృతభాండాన్ని వేటగాడి రూపంలో ఉన్న శివుడు బాణంతో కొడితే ఆ భాండం ముక్కలుగా విరిగి నేలమీద పడిందట. ఆ ప్రదేశమే కుంభకోణం. అలా విరిగిపడిన అమృతభాండపు ముక్కలు వివిధ శివలింగాలుగా రూపుదాల్చాయట. కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ఉన్న కుంభేశ్వర, సోమేశ్వర, చక్రపాణి, సారంగపాణి ప్రాంతాల్లో పడిన లింగాలు ప్రస్తుతపు ఆలయాల లాగా రూపుదిద్దుకున్నాయని చెబుతారు.
కుండలా ఉండే శివుడి ఆకారం
గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండం లో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుకతో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల కుమ్భేశ్వరుడయ్యాడని స్థలపురాణం. అందుకని ఇక్కడ నిత్యాభిషేకాలు ఉండవు .సుగంధ ద్రవ్యాలనే లేపనంగా పూస్తారు. శివుడి ఆకారం కూడా కుండ మూతిలా ఉండటం ఇక్కడి ఒక విశేషం. ఇక్కడ అమ్మవారిని మంగళాంబిక అనే పేరుతొ కొలుస్తారు.
పుష్కరిణిలో 21 బావులు
ఆరున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ పుష్కరిణిలో 21 బావులు ఉన్నాయి. చుట్టూ రాతిమెట్లు ఇంకా 16 మండపాలు కొలువుతీరి ఉన్నాయి. ప్రతి పన్నెండేళ్ళకి మాఘమాసంలో గురుడు సింహ రాశిలో ప్రవేశించినప్పుడు ఈ మహామాఘ పుష్కరాలు జరుగుతాయి. ఈ సమయంలో నవగంగలు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అన్ని నదుల నీరు వచ్చి ఇక్కడ కలుస్తుందని ఒక నమ్మకం. అదెలా సాధ్యం అన్నది ఇప్పటికీ అంతుచిక్కని విషయం. అందుకే పుష్కర సమయంలో కుంభకోణంలో దేవాలయాలన్నిటి నుంచి ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి స్నానం చేయిస్తారు. ఈ ఒక్కరోజే కనీసం పదిలక్షల మంది భక్తులు పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.
గమనిక: పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా రాసిన కథనం. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..