గ్రామ ప్రజలను, పంటలను, పశువులను రక్షించే అయనార్ గురించి తెలుసా మీకు!

భారతీయ సంప్రదాయంలో గ్రామదేవతలకి పెద్దపీటవేస్తారు. కులమతాలకు అతీతంగా ఆచారాలకు భిన్నంగా ఈ గ్రామంలో ఉండేవారంతా గ్రామదేవతలను పూజిస్తారు. ఇలాంటి ఆలయాల్లో ప్రత్యేకం తమిళనాడులో ఉన్న అయనార్ టెంపుల్… ఈయనను హరిహరసుతుడిగా చెబుతారు..

శివుడు – శ్రీమహావిష్ణువుకి పుట్టిన కొడుకు ఎవరంటే అయ్యప్పస్వామి అని చెబుతారు. అయితే ఈ అయనార్ కూడా హరిహరసుతునిగానే భావిస్తారు. మరికొందరైతే అయ్యప్పకు ఈ అయనార్ మరో రూపం అని కొలుస్తారు. తమిళనాడులో అతి ప్రాచీన గ్రంథమైన శిలప్పదిగారంలో ఈ అయనార్‌ ప్రస్తావన కనిపిస్తుంది. తమిళనాడులో పర్యటించేవారికి ప్రతి గ్రామం బయటా కొన్ని దేవాలయాలు కనిపిస్తాయి…వాటిబయట టెర్రకోటతో చేసిన గుర్రపు ప్రతిమలుంటాయి. ఇలా కనిపించేవన్నీ అయనార్ ఆలయాలే. అయనార్‌ గ్రామ ప్రజలతో పాటూ పంటలను, పశువులను రక్షిస్తాడని … దృష్ట శక్తులు దరిచేరకుండా చూస్తాడని నమ్ముతారు. అలా అయనార్ తమకోసం యుద్ధం చేస్తాడని చెప్పేందుకు సింబాలిక్ గా ఆలయాల బయట గుర్రపు ప్రతిమలను ఉంచి…అయనార్ చేతిలో ఖడ్గం, త్రిశూలం ఉంచుతారు…

తమిళ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు
అయనార్‌ స్వామికి తమిళ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు జరిపిస్తారు, జాతరలు నిర్వహిస్తారు. సాధారణంగా గ్రామదేవత అనగానే, బలులను సమర్పించే ఆచారం ఉంది కానీ…ఈ అయనార్ మాత్రం బలిని స్వీకరించకపోవడం విశేషం. అయనార్‌ గుడికి దగ్గరలోనే ఉండే కరుప్పుస్వామి వంటి గ్రామదేవతలకు మాత్రం బలిస్తారు.

కేరళలోనూ ఈ సంప్రదాయం
కేరళలో కూడా చాలా ప్రాంతాలలో ఈ అయనార్‌ ఆరాధన ఉండేదని చెబుతారు. కేరళలో అయనార్‌ను ‘షష్ట’ అనే పేరుతో పూజించేవారట. అయితే అయ్యప్ప ఆరాధన విస్తృతం కావడంతో, కేరళలో అయనార్‌ సంప్రదాయం తగ్గింది. తమిళనాడులో మాత్రం అయనార్ సెంటిమెంట్ చాలా ఉంది..

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..