అన్నం తిన్నాక స్వీట్ తినే అలవాటుందా..మీకీ విషయం తెలుసా మరి!

చాలామందికి భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా శుభకార్యాల్లో విందు భోజనం వడ్డించిన తర్వాత ఆఖర్లో స్వీట్ పెడతారు. కొందరైతే ఏకంగా స్వీట్స్ కి ఓ సెక్షనే పెట్టేస్తారు. ఎంచక్కా కడుపునిండా భోజనం తిన్న తర్వాత నోరు తీపి చేసుకుంటే ఆఫీల్ బావుంటుంది. అందుకే కేవలం ఫంక్షన్లలో మాత్రమే కాదు…రెగ్యులర్ గా కూడా చాలామంది అన్న తిన్నతర్వాత స్వీట్ తింటారు. ఈ అలవాటు మంచిదేనా కాదా.. భోజనం తర్వాత స్వీట్ తింటే ఏమవుతుంది..అసలు అన్నం తిన్నాక స్వీట్ తినాలనే కోరిక ఎందుకు పుడుతుందో తెలుసా..

అన్నం తిన్నాక స్వీట్ ఎందుకు తినాలనిపిస్తుంది
తీసుకునే ఆహారంలో సాధారణంగా ఉప్పు, కారం ఉంటాయి..అందుకే తిన్న తర్వాత నోటిని తీపి చేసుకుంటే తృప్తిగా అనిపిస్తుంది..అందుకే చాలామంది అనుకోకుండానే భోజనం తర్వాత స్వీట్స్ తింటారు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్లు తాగకూడదని చెబుతారు ఆరోగ్య నిపుణులు..కానీ తిన్నాక నీళ్లు తాగితే ఆ భోజనం సరిగ్గా జీర్ణమవుతుంది. కొందరు తిన్న వెంటనే నీళ్లు తాగరు..అలాంటప్పుడు స్వీట్ తినాలనే కోరిక పెరుగుతుంది
తినే ఆహారంలో పిండి పదార్థాల శాతం కూడా ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అదే సమయంలో నోరు తీపి చేసుకోవాలని కోరిక పుడుతుంది. చాలామంది బిర్యానీతో పాటూ డ్రింక్స్ తాగుతారు..మసాలా ఫుడ్ మధ్యలో తియ్యటి పానీయం లోపలకు దిగుతుంటే ఆ టేస్టే వేరు. ఇది కూడా ఓ రకంగా భోజనం తర్వాత తినడంతోనే సమానం. దీనికి కారణం ‘సెరటోనిన్’ అనే రసాయనం. కడుపునిండా భోజనం చేసిన తర్వాత విడుదలయ్యే రసాయనమే సెరటోనిన్. దీనివల్లే భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలనే కోరిక కలిగిస్తుంది.

స్వీట్ తినడం కూడా మానసిక సమస్యేనా?
స్వీట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా అంటే..కాదనే చెబుతారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా అన్నం తిన్నాక అస్సలు తినకూడదని చెబుతారు. ఆహారం జీర్ణమయ్యేందుకు, తృప్తినిచ్చేందుకు తాత్కాలికంగా పనిచేసినా అది దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందంటున్నారు. ఇలా తినేవారు భవిష్యత్ తో డాయబెటిస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి అన్నం తిన్నాడ స్వీట్స్ తినాలి అని అనిపించడం ఓ మానసిక సమస్య అట. సాధారణంగా భోజనం తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి..స్వీట్స్ తింటే ఇంకా ఈ స్థాయిలు రెట్టింపు అవుతాయి కాబట్టి ఈ అలవాటు ఉన్నవారు మానుకోవడమే మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతగా స్వీట్ తినాలి అనిపిస్తే బెల్లం నోట్లో వేసుకోవచ్చని చెబుతున్నారు.

ఇలా చేస్తే ఆ ఆలోచన రాదు
భోజ‌నం చేసిన తర్వాత తీపి తినాలనే ఆలోచన రాకుండా ఉండాలంటే భోజ‌నంలో ఎక్కువ‌గా కూర‌గాయ‌లు ఉండేలా చూసుకోవాలి. పిండి ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా తినాలి. భోజ‌నానికి ముందు కీర‌దోస‌, ట‌మాటా, క్యారెట్‌, బీట్‌రూట్ లాంటి వాటిని సలాడ్ గా తీసుకుంటే కడుపునిండినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత భోజనం చేస్తే స్వీట్ తినాలనే భావన కలగకుండా ఉంటుదట.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎలాంటి సందేహాలున్నా మీరు వైద్యులను సంప్రదించాలి. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకుంటారన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం