Spirituality: ఇంటి ముందు నిత్యం ముగ్గు వేస్తున్నారా – ఎందుకు వేయాలి, ఎలా వేయాలో తెలుసా మరి!

నిత్యం ఇంటిముందు నీళ్లు చల్లి ముగ్గువేస్తుంటారు. ముగ్గు అందానికో, పెద్దోళ్లు వేశారు కాబట్టి మనం కూడా పాటించాలనో కాదు…దాని వెనుక చాలా ఆంతర్య ఉంది.

నిలువు గీతలు – అడ్డు గీతల వెనుకున్న అర్థం ఇదే
ఇంటి ముందు మగ్గులో భాగంగా గీసే నిలువు-అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా అడ్డుకుంటూ…ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా చూస్తాయి
ఎప్పుడూ ముగ్గు ఒక్కటీ వేసేసి చుట్టూ బోడిగా వదిలేయకూడదు. వేసిన ముగ్గుకి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యం జరుగుతుందని అర్థం. పండుగలు, శుభకార్యాల్లో సమయంలో ముగ్గును ఇలా వేయాలంటారు పెద్దలు
దేవుడి పూజ చేసేముందు మందిరం దగ్గర కూడా ముగ్గు ఇలాగే వేయాలి
నక్షత్రం ఆకారంలో వేసే ముగ్గు నెగెటివ్ వైబ్రేషన్స్ ని దరిదాపులకు రాకుండా చేస్తుంది
ఇంటి ముందు వేసే పద్మం ముగ్గు కేవలం గీతలు కాదు..ఆ ముగ్గువెనుక యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలు ఉంటాయని తద్వారా చెడుశక్తి ఇంటి బయటే ఆగిపోతుందని పండితులు చెబుతారు
దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకుండా ఉండేలా చూసుకోవాలి.
కొందరికి సమీపంలో ఉన్న దేవాలయం దగ్గర నిత్యం ముగ్గు వేస్తుంటారు..ఇలా చేస్తే ఏడు జన్మల వరకూ వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తారని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.
ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేస్తే దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానించినట్టే

బియ్యం పిండితో ముగ్గువేయాలి
నిత్యం ముగ్గులు వేయలేక పెయింట్ లు పెట్టేస్తుంటారు కానీ శాస్త్రం ప్రకారం ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి. ఎందుకంటే చీమలు, ఈగలు, కీటకాలకు ఈ ముగ్గే ఆహారం. అంటే అతిథి దేవోభవ అని మాటల్లో చెప్పడం కాదు..ముగ్గుద్వారా కంటికి కనిపించని మూగజీవాల ఆకలి తీరుస్తున్నామని చెప్పడమే ఇందుకు నిదర్శనం.

ఇంటి ముందు ముగ్గు చూసి సన్యాసులు భిక్ష అడిగేవారు
ఇంట్లో ఎవరైనా ఉన్నారో అని చెప్పేందుకు వాకిట్లో వేసిన ముగ్గే సూచన. అందుకే అప్పట్లో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ప్రతి ఇంటికీ తిరిగి బిక్ష అడిగేటప్పుడు ఇది గమనించేవారట. ఏ ఇంటి ముందు ముగ్గులేదో ఆ ఇంటికి వెళ్లేవారు కాదు. ఒకవేళ ఇంటి తలుపులు తెరిచి ఉన్నప్పటికీ వాకిట్లో ముగ్గు లేకపోయినా ఆ ఇంటి నుంచి బిక్షస్వీకరించేవారు కాదు…దీనికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఏదైనా అశుభం జరిగిందేమో అని. సాధారణంగా ఇల్లు కడిగిన తర్వాత ముగ్గువేస్తారు కానీ శ్రాద్ధ కర్మలు జరుగుతున్న సమయంలో ముగ్గు వేయారు… ఆ కర్మ పూర్తైన తర్వాత ఇల్లు మరోసారి కడిగి ముగ్గువేస్తారు.

సంతానోత్పత్తి సమస్యలు దూరమవుతాయి
ఆడవారు చీపురు పట్టుకుని కిందకు వంగి వాకిలంతా ఊడ్చి..కళ్లాపి చల్లి..ముగ్గు పెడతారు. ఈ ప్రక్రియ మొత్తం కనీసం 20 నిముషాలు పడుతుంది. అంటే ఈ 20 నిముషాలు వంగి – లేచి- వంగి -నిల్చుని ఉంటారు. ఇంతకు మించిన మంచి ఎక్సరసైజ్ ఏముంటుంది. మరీ ముఖ్యంగా ఆడవారు వంగి ముగ్గువేయడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు ఏమైనా ఉంటే మాయమై..పొట్టకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.