టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ నాలుగు మూల స్తంభాలు. పవన్, మహేశ్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ వీళ్లంతా ఈ తర్వాత వరుసలో ఉంటారు. అయితే యంగ్ హీరోలు ఎలాంటి కథలు ఎంపిక చేసుకున్నా పర్వాలేదు కానీ సీనియర్ హీరోలు మాత్రం ఇక రూట్ మార్చాల్సిందేనా…
ఇప్పుడున్న యంగ్ హీరోలంతా పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులతో దూసుకెళ్లిపోతున్నారు. అప్పట్లో ఇంతకు మించి సినిమాలు చేశారు ప్రస్తుత సీనియర్ హీరోలు చిరు,నాగ్, వెంకీ, బాలయ్య. ఇప్పటికీ ట్రెండ్ సెట్ చేయగల సత్తా వీళ్లకుంది కానీ ప్రాజెక్టుల ఎంపికలో చిన్న మార్పులు చేసుకుంటేనే అధి సాధ్యమవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. చిరంజీవి వయసు 67 ఏళ్లు. మనవళ్లు, మనవాళ్లతో ఆడుకునే సమయం. అయినప్పటికీ నటుడికి రిటైర్మెంట్ ఉండదన్నట్టు ఉత్సాహంగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇంకా పాటలు, డాన్సులు, పంచ్ డైలాగులు, మనవరాలి వయసున్న హీరోయిన్ తో చిందులు సెట్ కావు. ఈ విషయాన్ని నిరూపించింది భోళా శంకర్. వయసుకి తగిన క్యారెక్టర్స్ ఎంపిక చేసుకుని మంచి ప్రాజెక్ట్ తో వస్తే మెగాస్టార్ క్రేజ్ ఇప్పటికీ చెక్కుచెదర్లేదని క్లారిటీ వచ్చేస్తుంది.
ఈ విషయంలో బాలకృష్ణ కొంత నయం. ఓ వైపు కుర్రహీరోయిన్లతో స్టెప్పులేస్తన్నప్పటికీ మరోవైపు తన వయసుకి తగిన క్యారెక్టర్స్ కి ఓటేస్తూ దూసుకెళతున్నారు. అఖండ సినిమానే అందుకు నిదర్శనం. వెంకటేష్ లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దృశ్యంలో సినిమాల్లో ఇద్దరు పిల్లలకు తండ్రిగా, మధ్య వయస్కుడిగా కనిపించారు. నారప్పలోనూ అంతే! అయితే ఇవి రెండూ రీమేక్ సినిమాలు. మాతృకలో ఉన్న ఫార్ములానే పాటించారు. మరి స్ట్రైయిట్ సినిమాల్లో ఇలాంటి పాత్ర పోషిస్తారా అన్నదే చూడాలి. ప్రస్తుతం సెట్స్ మీదున్న సైంధవలో వెంకీ మధ్య వయస్కుడి పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. వయసు పై బడుతున్నా ఫాలోయింగ్ పెంచుకుంటున్న హీరో నాగార్జున. అలాగని ఇప్పటికీ మన్మధుడిలానే కనిపించాలంటే ఎలా. తన ఇద్దరు కొడుకులు హీరోలయ్యారు. సరైన టైమ్ కి చైతూకి పిల్లలు పుట్టి ఉంటే నాగ్ కూడా తాతయ్యే. అయితే ప్రయోగాలకు సిద్ధంగా ఉండే నాగార్జున ఊపిరిలో మంచానికే పరిమితమయ్యే రోల్ పోషించాడు, అదే సమయంలో మన్మథుడు 2 లో లవర్ బాయ్ లా నటించాడు.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ హీరోలంతా ఇప్పుడు ‘జైలర్’ లో రజనీకాంత్ ని ఆదర్శంగా తీసుకోవాలి రాజా అంటున్నారు సినీ ప్రియులు. దంగల్ లో అమీర్ ఖాన్ పెద్ద పొట్టేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించాడు. మన హీరోలు కూడా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఇలాంటి పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. నిజంగా ఈ మార్పు వస్తే తెలుగులో ఇంకా మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది.