ప్రజలు డబ్బులు తింటారా ? బియ్యానికి నగదు బదిలీ కాంగ్రెస్ స్కీంపై తీవ్ర విమర్శలు !

దేశంలో తిండికి అలమటించే వారి ఆకలి తీర్చడానికి పెట్టిన పథకం రేషన్. వారు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయలేరని ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ రేషన్ తీసుకోవద్దు మీకు డబ్బులిస్తాం అంటోంది కాంగ్రెస్. బియ్యానికి బదులుగా నగదు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటక ఫార్ములాను అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామన్నట్లుగా కాంగ్రెస్ చెబుతోంది. బియ్యం బదులు నగదు ఇచ్చే కార్యక్రమంతో భవిష్యత్తులో ఆహార కొరత, పౌష్టికాహార లోపం తాండవం చేసే ప్రమాదం ఉంది.

అధిక హామీలిచ్చి చేతులెత్తేయడమే…!

ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి విధానాన్ని తెరమీదకు తెచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు పథకం లక్ష్యం బియ్యం కొనుగోలు చేయలేని వారి కడుపు నింపడం. అలాంటప్పుడు బియ్యం వద్దనుకునేవారికి కార్డుకు అర్హత ఉంటుందా అనేది సహజంగా వచ్చే సందేహం. మెల్లగా ఇలాంటి వారికి కార్డులను కట్ చేసే అవకాశం ఉంది. పేదలకు డబ్బులకు ఆశపడితే మొదటికే మోసం రావొచ్చు. పేదవాడి కడుపు నింపే ఈ పథకాన్ని కూడా నియంత్రించి నిధులు మిగుల్చుకోవాలనుకోవడం అవివేకం. బాధ్యత లేని పాలకుల నిర్ణయం. ప్రజల్ని ఉచిత పథకాలకు బానిసల్ని చేసే క్రమంలో కాంగ్రెస్ కర్ణాటకలో చేస్తున్న ప్రయోగం ప్రమాదకరంగా కనిపిస్తోంది.

బియ్యమే కొంటారన్న గ్యారంటీ ఏముంది ?

నగదు బదిలీ ద్వారా ప్రభుత్వం కార్డుదారుల ఖాతాల్లో నగదు వేస్తుంది. వీటిని బ్యాంకు నుంచి తీసుకున్నాక.. బియ్యమే కొనుక్కుంటారని చెప్పలేం. ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చు. కొందరు మద్యం తలుపు తట్టవచ్చు. దీంతో ఆయా కుటుంబాలు పస్తులతో గడపాల్సిన పరిస్థితికి దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నగదు బదిలీ అమలు చేస్తే ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం తగ్గిపోతుంది. ఇదే అదనుగా వ్యాపారులు బియ్యం ధరలు పెంచే అవకాశం ఉంది. అది కార్డుదారులకు బియ్యం మరింత భారం అవుతాయి. అంతిమంగా అది మధ్యతగతి జీవుల్ని కూడా ఆకలి చావులకు గురి చేసే ప్రమాదం ఉంది.

భారం తగ్గించుకోవడానికి అనర్హుల్ని ఏరి వేయవచ్చు కదా !

ప్రభుత్వాలు ఇప్పటికైనా భారం తగ్గించుకునే ఆలోచనలలను కాస్త తెలివిగా మార్చుకోవాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెట్టి నిజమైన రాజనీతి చేయాలి. ఎవరికైతే అవసరమో వారికి మాత్రమే పథకాలు అమలు చేయాలి. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. ఇలా చేయడం… అధికారం ఇచ్చిన ప్రజల్ని వంచించిడమే. తమ స్వార్థం కోసం ప్రజల్ని ఆకలి చావులకు గురి చేయడమే. రాజకీయ పార్టీలు అవగాహనా లేమితో స్కీమ్స్ ప్రకటించి.. వాటిని అమలు చేయకుండా ఇలా నగదు బదిలీకి అలవాటు చేయడం ప్రజల్ని మోసం చేయడమే అవుతోంది.