ఈ పూలతో దేవుడికి పూజ చేయకూడదు

పూజలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. సకల భక్ష్యాలతో నైవేద్యం సమర్పించకపోయినా భక్తితో దేవుడి పాదాల దగ్గర పూలు వేస్తే చాలు. వాటిని తీసి కళ్లకు అద్దుకుని అదే మహాప్రసాదంగా భావిస్తారు. అయితే పూసే పూలన్నీ భగవంతుడిని చేరుకోలేవు. ఎందుకంటే కొన్ని పూలు పూజకు నిషిద్ధం..అవి ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

పూజకుపనికిరాని పూలు ఇవే
పూజకు పనిరావని పువ్వుల్లో ఈ 3 ప్రధానమైనవి మొగలిపూలు, సంపంగి, సన్నజాజి,బంతి. మొగలిపువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు. పైగా వాసన ఎక్కువగా ఉండడం వల్ల వెగటుగా అనిపిస్తుంది. ఆహ్లాదాన్ని, అనుకూల శక్తిని ఇవ్వదు. కోర్కెలు పెంచుతుంది. ఇవి ఉన్న దగ్గర పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. అందుకే వాటిలో ఉండే కోపం, పగం, కోర్కెలు ఇవన్నీ మనుషులలో కలుగుతాయనే పూజకు పనికిరావని చెబుతారు. దీనితో పాటూ ఎక్కువ వాసన వచ్చే పూలు సంపంగి, సన్నజాజి, మల్లెపూలు కూడా పూజల్లో పెద్దగా వినియోగించరు.
బంతిపూలు కూడా పూజకు ఉపయోగించరు. వీటికి ఎలాంటి శాపం లేదుకానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతిపూలు గుమ్మానికి కడతారు. వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించి, నాశనం చేసే శక్తి ఉంది. వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుప్రక్కల క్రిమి కీటకాలు అక్కడ చేరతాయి. పైగా దేవుని దగ్గర వుపయోగించే పూలు, అగరుబత్తి, ధూపం, హారతి, గంట అన్నీ క్రిమి కీటకాలని పారద్రోలేవిగా వుంటాయి. ఇక క్రిమి కీటకాలను ఆకర్షించే బంతిపూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందిపడతారు. అందుకే బంతి పూలతో పూజ వద్దంటారు. ఇంకా మైల ఉన్నవారు, బహిష్టులైనవారు తాకిన పూలు పూజకు పనికిరావు. క్రింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమచేత్తో కోసిన పూలు, వాడిపోయిన పూలు పూజకు పనికిరావు.

ప్లాస్టిక్ పూలు వద్దు
ఇంట్లో దేవుడి ఫోటోల‌కు కానీ, పెద్ద వారి ఫోటోల‌కు కానీ ప్లాస్టిక్ పూల మాల‌ల‌ను అస్స‌లు వేయ‌కూడ‌దు. ప్లాస్టిక్ పూలు కూడా పెట్టకూడ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు తాజా పువ్వుల‌ను మాత్ర‌మే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పూలు దేవుడి ఫొటోలకు వేస్తే అరిష్ఠం అంటారు పండితులు. అలాగే కాగిత‌పు పూలను కానీ దండ‌ల‌ను కానీ ఎటువంటి ఫోటోల‌కు వేయ‌కూడ‌దు. తాజా పూలు ప్రత్యేక వాసన కలిగి ఉంటాయి. అవి మనసుకి ఆహ్లాదాన్నిస్తాయి. రోజూ తాజా పూలతో పూజ చేయ‌డం వ‌ల్ల మ‌నుషుల‌ల్లో కోపం, క్రూర‌త్వం త‌గ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పూలను స‌మ‌ర్పించ‌డం వల్ల ఇలాంటి భావ‌న‌లు మ‌న మ‌న‌సులో క‌ల‌గ‌వు. తాజా పూలను స‌మ‌ర్పించి భ‌గ‌వంతుడి నామ‌స్మ‌ర‌ణ చేయాలి. అప్పుడే మ‌నం చేసిన పూజ‌కు ఫ‌లితం ల‌భిస్తుందంటారు పండితులు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.