సనాతన వివాదంలో డీఎంకే – రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి

రాజకీయ నాటకాలకు పేరు పొందిన డీఎంకే మరో వివాదానికి తెరతీసింది. సనాతన ధర్మంపై దాడికి యత్నించి వెనక్కి తగ్గడం ఆ పార్టీ చేసే డ్రామాల్లో ఒకటిగా చెప్పుకోక తప్పదు. అభ్యుదయ తమిళ రచయితల సమావేశం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే మూడు తరం నాయకులైన ఉదయనిధి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సనాతన ధర్మాన్ని పూర్తిగా తుడిచి పెట్టాలని ఆయన పిలుపునివ్వడం పెద్ద వివాదమై కూర్చుంది. అంతలోనే వెనక్కి తగ్గడం కూడా డీఎంకే రాజకీయ అనివార్యతకు దర్పణం పట్టింది.

ముమ్మాటికి స్టాలిన్ గేమ్ ప్లానే..

నిజానికి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా డీఎంకే చాలా మాట్లాడుతుంది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టేట్ మెంట్ కూడా అలాంటిదేనని అనుకుంటున్న తరుణంలో ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు దానికి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించడం వెనుక సీఎం కుమారుడికి దేశవ్యాప్త గుర్తింపు తీసుకురావాలన్న తపన కనిపించింది. బీజేపీ అగ్రకులాల పార్టీ అని ప్రచారం చేయాలన్న కోరిక కూడా స్టాలిన్ వర్గంలో కనిపించింది. దాదాపు పక్షంలో రోజుల పాటు సనాతన ధర్మంపై చర్చ కొనసాగడం వెనుక డీఎంకే గేమ్ ప్లాన్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడు మంత్రుల ఒక్కరొక్కరుగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, చివరకు కొవిడ్ తో కూడా పోల్చి.. స్టాలిన్ కుటుంబం పట్ల తమకున్న భక్తిని చాటారు. రాజ్యాంగమిచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను కొన్ని వర్గాల ఎలా దుర్వినియోగం చేస్తాయో కూడా వర్తమాన రాజకీయాల్లో ఈ ఘటన కళ్లకు కట్టింది.నుపుర్ శర్మ ఎపిసోడ్లో మాత్రం అలాంటి భావప్రకటా స్వేచ్ఛకు అవకాశం లేకుండా పోయింది.

ఎందుకు వెనక్కి తగ్గినట్లు

కుల వ్యవస్థ లాంటి సనాతన ధర్మంలో ఉన్న తిరోగమన విధానాలపై యుద్ధం ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఎంకే స్టాలిన్ తన తీరును మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ వారెవ్వరూ సనాతన ధర్మంపై మాట్లాడకూడాదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా నిజంగానే స్టాలిన్ ఆలోచనా తీరులో మార్పు వచ్చిందా లేక వ్యూహాత్మక వెనుకడుగా అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తాయి. ద్రవిడ ఉద్యమాన్ని అధ్యయనం చేసిన వారికి మాత్రం ఇదీ కొత్తగా కనిపించలేదు. ఎందుకంటే కులాన్ని డీఎంకే రాజకీయ ఆయుధంగా వాడుకోవడం మొదలు పెట్టి చాలా రోజులైంది. సామాజిక రుగ్మలతకు బ్రాహ్మణులే కారణం అని ఆరోపిస్తూ కొన్ని కులాలపై డీఎంకే దశాబ్దాల పాటు పెత్తనం చేలాయించింది. ప్రస్తుత పరిణామాల విషయానికి వస్తే తమిళనాడులో బీజేపీకి పెద్దగా బలం లేనప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర శాఖాధ్యక్షుడు అన్నామలై పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి డీఎంకే నేతల కూసాలు కదలుతున్నాయని చెప్పక తప్పదు. డీఎంకే నేతలు,మద్దతుదారుల దాడులతో విసిగిపోయిన దళిత సామాజికవర్గాల వారు అన్నామలైను సాదరంగా ఆహ్వానించి సన్మానించడం డీఎంకే పెద్దలకు అసలు మింగుడు పడటం లేదు.

వెనుకబడే ఉన్న దళితులు

ఏడెనిమిది దశాబ్దాల ద్రవిడ ఉద్యమంలో తమిళ దళితులకు ఎప్పుడూ సముచిత స్థానం లభించలేదు. ఆత్మగౌరవ ఉద్యమంలో వాళ్లకు పాల్గొనే అవకాశమూ రాలేదు. వాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడే వారూ కనిపించలేదు. డీఎంకే అకృత్యాలను భరించలేకే మీనాక్షీపురం గ్రామంలో దళితులంతా ఇస్లాంలోకి మారడం ఎప్పటికీ మరిచిపోలేని అంశం. ఇప్పటికీ హోటళ్లలో దళితులకు వేరే ప్లేట్లు, గ్లాసుల్లో భోజనం, టీ ఇస్తారంటే తమిళనాడులో దళితులు ఎంతటి అణచివేతకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. స్టాలిన్ ముఖ్యమంత్రిత్వంలో దళిత విద్యార్థులపై దాడులు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే వాటన్నింటినీ పక్కకు తోసి… ద్రవిడ ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు డీఎంకే సనాతన ధర్మంపై చర్చకు తెరతీసింది. ఐనా వారి ఆటలు సాగలేదనే చెప్పారు. డీఎంకే వెనక్కి తగ్గక తప్పలేదు.

సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పిన మద్రాసు హైకోర్టు..

సనాతన ధర్మంపై చర్చకు మద్రాసు హైకోర్టు చక్కని పరిష్కారం చెప్పింది. సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ, అంటరానితనం కాదని జస్టిస్ శేషసాయి తేల్చారు. హిందువులుగా చెప్పుకునే వాళ్లు తమ సామాజిక బాధ్యతలను గుర్తించడం, పాలకుల ప్రజల ప్రజలు- ప్రజల పట్ల పాలకులు బాధ్యతగా మెలగడం, తల్లిండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రున్ని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి సనాతన ధర్మం కిందకు వస్తాయని, ఆ మూల సూత్రాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని జస్టిస్ శేషసాయి అభిప్రాయపడటంతో అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో డీఎంకే వారికి తెలిసొచ్చింది. పురోగామి విధానమైన సనాతన ధర్మంలో కులవ్యవస్థ కలుపుమొక్క లాంటిదని కూడా ఆయన తేల్చేశారు. ఈ తీర్పు డీఎంకేను చావుదెబ్బగానూ, హిందూ వాదులకు టానిక్ గానూ పనిచేస్తుందని చెప్పాలి.ఇప్పడిక డీఎంకే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాన్ని ఎలా నిర్వహిస్తుందో చూడాలి. ఎందుకంటే సనాతన ధర్మంపై చర్చలో ఆ పార్టీకి తొలి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.

ఇండియా గ్రూపు నుంచి వ్యతిరేకత

డీఎంకే తీరుపై ఇండియా గ్రూపు నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు సాఫ్ట్ హిందూత్వాన్ని పాటిస్తున్న తరుణంలో డీఎంకే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్లో ఇండియా గ్రూపు ర్యాలీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. డీఎంకే అలా మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకున్నారంటూ కొందరు హిందూత్వవాదులు శివసేన నాయుకుడు ఉద్ధవ్ ఠాక్రేను ప్రశ్నించడంతో ఆయన నీళఅలు నమిలారు. ఇండియా గ్రూపులో చాలా పార్టీలు డీఎంకే స్టేట్ మెంటుకు దూరం జరిగిన మాట వాస్తవం. ఇక ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో దీనిప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. డీఎంకే వెనక్కి తగ్గినంత మాత్రాన సనాతన వివాదం సమసిపోదు. తమిళనాడు అధికార పార్టీ దుర్నీతిని ఎండగట్టేందుకు అన్నామలై లాంటినేతలు ఉండనే ఉన్నారు కదా..