ఎన్నికల వేళ ప్రధాని మోదీ తన రాజకీయ ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. వారి దుశ్చర్యలను ఎండగడుతున్నారు. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను ప్రతీ ఇంటర్వ్యూలో ఎండగడుతున్నారు. ఆ పార్టీ దుష్ట పరిపాలన కారణంగా రాజకీయంగా, సామాజికపరంగా, భూభాగం పరంగా దేశం ఎంతగా నష్టపోయిందో మోదీ పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. ఇకపై ఆ పార్టీని ఉపేక్షించాల్సిన అవసరం లేదని కూడా తెగేసి చెబుతున్నారు…
పాకిస్థాన్ ఒకప్పుడు మనదేశమే…
పాకిస్థాన్ దగ్గర అణుబాంబు ఉందని, ఆ దేశం పట్ల జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను మోదీ గట్టిగా తిప్పికొట్టారు. మోదీ పేరు చెబుతేనే పాకిస్థాన్ వణికిపోతోందని ఆయన గుర్తిచేశారు. పాకిస్థాన్ ఎంత శక్తిమంతమైన దేశమో చూసేందుకు తాను స్వయంగా అక్కడకు వెళ్లానని మోదీ చెప్పారు. పాకిస్థాన్ డొల్లతనాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావినంచారు. తాను వీసా లేకుండా పాకిస్థాన్ వచ్చానని కొందరు ప్రస్తావించారని, పాకిస్థాన్ ఒకప్పుడు తన దేశమేనన్న సంగతి వారికి గుర్తుచేశానని మోదీ అన్నారు.
కొందరు గుక్క పట్టి ఏడుస్తున్నారు…
పాకిస్థాన్ కోసం కొందరు గుక్క పట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పాకిస్థానీయులు ఏడిస్తే అర్థం చేసుకోవచ్చని, మన వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఒక పార్టీ నాయకుడు ముంబై పేలుళ్ల పట్ల చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటుగా ఉన్నాయన్నారు. మనవాళ్లను కసబ్ చంపలేదని, భారతీయులే చంపారని అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడల్లా ఆందోళనతో తన రక్తం తుక తుక ఉడుకుతుందన్నారు….
కాంగ్రెస్ పార్టీది విభజన రాజకీయం
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను నిత్యం విభజించి పాలించిందని మోదీ అన్నారు. 1971 యుద్ధంలో 90 వేల మంది పాకిస్థానీ సైనికులు మనకు లొంగిపోయారని ఆయన గుర్తుచేశారు. అప్పుడు తాను అధికారంలో ఉండి ఉంటే కర్తార్ పూర్ సాహెబ్ ను స్వాధీనం చేసుకున్న తర్వాతే పాక్ సైనికులను విడిచిపెట్టేవాడినన్నారు. అప్పట్లో వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ జారవిడిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం దేశ విభజనకు ఒప్పుకుందన్నారు. పాకిస్థాన్ ఎన్నడూ భారత్ వైపుకు నేరుగా చూసే ధైర్యం చేయదని ఆయన అన్నారు. కేవలం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, బాంబు పేలుళ్లు సృష్టించడం లాంటి చర్యల ద్వారానే కక్షసాధింపుకు దిగుతుందని, మనం ఎప్పటికప్పుడు గట్టిగా సమాధానం చెబుతున్నామని మోదీ గుర్తుచేశారు. దేశంలోని కొందరు నేతలు మాత్రం పాకిస్థాన్ కు కొమ్ము కాస్తూ మన జాతీయవాదాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారన్నారు. అలాంటి వారికి ఎన్నికల్లో దేశ ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారన్నారు….