విజయనగరం రాజు గారికి అసంతృప్తి సెగ – వారసురాలికి ఈ సారి టీడీపీ టిక్కెట్ కూడా కష్టమేనా ?

ఏపీలోని హై ప్రోఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం అసెంబ్లీ స్థానం. టీడీపీ నేత, పూసపాటి రాజవంశీకుడు అశోక్ గజపతిరాజు కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో టీడీపీ పట్టు క్రమంగా సడలుతోంది. కుటుంబ గొడవలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో అశోక్ తో పాటు ఆయన కుమార్తె కూడా ఓడిపోయారు. వైసీపీ వేవ్‌లో.. టీడీపీ కంచుకోట బద్దలైంది. అలాంటి చోట.. తాజా రాజకీయ పరిస్థితులు.. చర్చనీయాంశంగా మారాయ్.

తిరుగులేని స్థానం నుంచి గెలవడానికి తంటాలు పడాల్సిన పరిస్థితి దాకా ?

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్ గజపతి రాజు.. 1983 నుంచి 1999 వరకు వరుసగా.. ఐదు సార్లు తెలుగుదేశం నుంచి విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తంగా.. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. విజయనగరం సెగ్మెంట్‌లో కొత్త చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మండలం విజయనగరం. పట్టణంతో పాటు మండల పరిధిలో.. 2 లక్షల 30 వేల మందికి పైనే ఓటర్లున్నారు. వీరిలో.. బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. వాళ్లే ఇక్కడ గెలుపోటములను నిర్దేశిస్తుంటారు. గత ఎన్నికల్లో తొలిసారి వైసీపీ ఇక్కడ గెలుపు జెండా ఎగరేసింది. తెలుగుదేశం తరఫున పోటీ చేసిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుపై 6 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా గెలిచారు.

స్థానిక ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ గెలవని టీడీపీ

సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి విజయనగరంలో మంచి ఇమేజ్ ఉంది. స్థానిక ఎన్నికల్లో కార్పొరేషన్ లో టీడీపీ ఒక్క చోట కూడా గెలలేదు. వైశ్యవర్గానికి చెందిన వీరభద్ర స్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి టీడీపీ తరఫున నేరుగా అశోక్ గజపతిరాజే పోటీ చేస్తారన్న గ్యారంటీ లేకపోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన కుమార్తె అధితి గజపతిరాజు తానే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. తానే పోటీ చేస్తానంటున్నారు.

టీడీపీ టిక్కెట్ కోసం మీసాల గీత ప్రయత్నం

మరో వైపు మాజీ ఎమ్మెల్యే, ఒకప్పుడు అశోక్ ఆశీస్సులతో గెలిచిన మీసాల గీత విజయగనరంలో ప్రత్యేక ఆఫీస్ పెట్టుకుని టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తనకే చాన్సివ్వాలని కోరుతున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమితో.. ఈసారి ప్రయోగాలకు తావు లేకుండా.. నేరుగా అశోక్ గజపతినే బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పోటీ హోరాహోరీగా ఉంటుంది. బంగ్లా రాజకీయాలు చేసే పూసపాటి అశోక్ గజపతిరాజు… ప్రస్తుత రాజకీయాలకు సరిపోరన్న వాదన వినిపిస్తోంది.