నాన్ లోకల్సే మా లీడర్లా ? అనంతపురం జిల్లా ప్రజల్లో అసంతృప్తి !

ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో అంతర్మథనం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నేతలు ఎంతో మంది ఉన్నా వలస నేతలే కీలక నేతలుగా ఆయా పార్టీల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో చెలామణి కావడం చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ, వైసీపీ రెండు పార్టీల్లోనూ ఇదే పంచాయతీ కనిపిస్తోంది. ఇతర నేతల్ని తీసుకొచ్చి తమపై రుద్దడాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ స్థానికులకే టిక్కెట్లు కేటాయించారన్న డిమాండ్ పెరుగుతోంది.

వలస నేతలకే వైసీపీ ప్రాధాన్యం

అధికార పార్టీ వైసీపీలో వలస నేతలు ఎక్కువగా ఉన్నారు. హిందూపురం వైసిపిలో ఇన్‌ఛార్జీగానున్న మహమ్మద్‌ ఇక్బాల్‌కు స్థానిక వైసిపి నాయకులే స్థానికేతరులంటూ నాన్‌లోకల్‌ సమస్యను ముందుకు తెచ్చారు. ఐపిఎస్‌ రిటైర్డు ఉద్యోగి అయిన మహమ్మద్‌ ఇక్బాల్‌ కర్నూలుకు చెందిన వారు. 2019 ఎన్నికలకు ముందు హిందూపురం నియోజకవర్గానికి వైసిపి టిక్కెట్టు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓటమి చెందారు. అయితే ఆ తరువాత కూడా నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా ఉన్నప్పటికీ స్థానిక నాయకులకు, ఆయనకు మధ్య విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. కళ్యాణదుర్గంలోనూ మంత్రి ఉషచరణ్‌ శ్రీకి వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపు నాన్‌ లోకల్‌ నినాదాన్ని తీసుకొచ్చింది. స్థానికులకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వాలన్న డిమాండ్‌ను వినిపిస్తోంది. ఉషచరణ్‌ శ్రీ 2019 ఎన్నికలకు ముందే వైసిపిలో చేరారు. ఆమె నియోజకవర్గం కల్యాణదుర్గం కాదు.

ఇద్దరు పార్లమెంట్ సభ్యులూ అనంతపురం వారు కాదు !

ఉమ్మడి అనంతపురం జిల్లాలోనున్న అనంతపురం, హిందూపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌ ఇద్దరూ కర్నూలు జిల్లాకు చెందిన వారు. వీరి విషయంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వస్తూనే ఉంది. అయితే పై ఇద్దరూ జిల్లాలోనే ఎక్కువ కాలం పనిచేయడంతో ఇక్కడి వారేనన్నట్టుగా ఉన్నప్పటకీ రాజకీయాల్లో మాత్రం ప్రతి అంశం వివాదాస్పదం అవుతోంది. ఇది ప్రజల్లోనూ చర్చనీయాంశం కావడంతో.. ఇప్పుడు వీరిని మార్చాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.

టీడీపీలోనూ నాన్ లోకల్ వివాదం

లోకల్‌, నాన్‌లోకల్‌ అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ హైలెట్ అవుతోంది. హిందూపురంలో బాలకృష్ణ నాన్ లోకల్, అయితే టీడీపీలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉండరు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్‌ఛార్జీగానున్న ఉమామహేశ్వరనాయుడు ఉరవకొండకు చెందిన వారు. ఎన్నికలు వచ్చేసరికి ఇటువంటి అంశాలు మరిన్ని ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల్లోనూ సొంత పార్టీ నాయకుల నుంచే స్థానికత అంశం ముదురుతుండటంతో అనంతపురం రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.