కన్నడ రాజకీయాలను మార్చేసిన వీరేంద్ర పాటిల్ తొలగింపు

రాజకీయాలు మారడానికి ఒక సంఘటన చాలు . దాని తాలూకు ప్రకంపనలు చాలారోజులు తెలుస్తుంటాయి. క్రమంగా జనం మదిలో ఆ ఘటన నాటుకుపోయి ఓ పార్టీపై తీవ్ర వ్యతిరేకత స్థిరపడిపోతుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పిలిచే కాంగ్రెస్ పట్ల జనంలో వ్యతిరేకతా భావం పెరగడానికి కూడా ప్రతీ రాష్ట్రంలో ఒక సంఘటన ఉంటూనే ఉంది..

ఏపీలో అంజయ్య, కర్ణాటకలో వీరేంద్ర పాటిల్

రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ నాయకుడైన కొత్తల్లో ఆయన ప్రవర్తన విచిత్రంగానూ, విసుగు పుట్టించేదిగానూ ఉంది. హైదరాబాద్ విమానాశ్రయంలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యను అవమాన పరిచిన తీరు తర్వాతి కాలంలో పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కట్ చేసి చూస్తే 1990లో కర్ణాటక రాజకీయాల్లో కూడా దాదాపు అలాంటి ఘటనలే జరిగాయి. వీరేంద్ర పాటిల్ ను జనం ఇప్పుడు మరిచిపోయి ఉండొచ్చు. 1990లో రాజీవ్ గాంధీ ఆయన్ను కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తీరును తెలిసిన వారికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వీరేంద్ర పాటిల్ గుర్తుకు వస్తూనే ఉంటారు.

వీరేంద్ర పాటిల్ వ్యవహారం కూడా ఎయిర్ పోర్ట్ డ్రామానే.. అదీ బెంగళూరు విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ ఆడిన నాటకమని చెప్పాలి. 1969లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వీరేంద్ర పాటిల్ తర్వాత పార్టీని వదిలేశారు. 1980లో జనతాపార్టీ అభ్యర్థిగా చిక్ మగళూరులో ఇందిరాగాంధీపై పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ లో చేరి 1990ల్లో మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కర్ణాటకలో మత కలహాలు జరిగాయి. ఆరోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న వీరేంద్ర పాటిల్ ను పలుకరించేందుకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ( అప్పుడాయన ప్రధానమంత్రి కాదు)… రాష్ట్రంలో ఏరియల్ సర్వే కూడా జరిపారు. ఢిల్లీ వెళ్తూ బెంగళూరు విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడిన రాజీవ్… నాలుగు రోజుల్లో వీరేంద్ర పాటిల్ రాజీనామా చేస్తారని, అనారోగ్యంతో బాధపడుతున్నందున అందుకు ఆయన అంగీకరించారని ప్రకటించారు. అయితే ఆ సంగతి తెలిసిన వెంటనే విలేకర్లను పిలిచిన వీరేంద్ర పాటిల్ తాను ఆరోగ్యంగానే ఉన్నానని రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రకటించేశారు.

పాటిల్ తిరుగుబాటు

పాటిల్ తిరుగుబాటుకు ఇతర పార్టీలు మద్దతిచ్చారు. అప్పటి ప్రధాని వీపీ సింగ్ కూడా తమ పార్టీ సమర్థింపు ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్ శాససనభా పక్షం సమావేశం కూడా జరిగింది.. కాకపోతే ఒత్తిడిని పాటిల్ తట్టుకోలేకపోయారు. ఆయన రాజీనామా చేయడంతో బంగారప్ప కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు.

కాంగ్రెస్ పై లింగాయత్ ల ఆగ్రహం

వీరేంద్ర పాటిల్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దానితో రాజీవ్ గాంధీ తమ వర్గానికి కించపరిచారని లింగాయత్ లు నొచ్చుకున్నారు. కర్ణాటకలో 17 శాతం జనాభా ఉన్న లింగాయత్ సామాజిక వర్గం కాంగ్రెస్ నుంచి దూరం జరిగి జనతాపార్టీ వైపు మొగ్గు చూపడానికి నాటి రాజీవ్ గాంధీ వైఖరే కారణమని భావిస్తారు.కాకపోతే 2000 సంవత్సరం నాటికి లింగాయత్స్ బీజేపీ వైపు జరిగారు. ఇప్పుడు లింగాయత్ సామాజికవర్గం బీజేపీకి కంచుకోట. 1990ల్లో ఆరెస్సెస్ ప్రచారక్ గా మాత్రమే ఉన్న లింగాయత్ నేత యడ్యూరప్ప బీజేపీలో చేరి పెద్ద లీడర్ కావడానికి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి కూడా నాటి వీరేంద్ర పాటిల్ సంఘటనే కారణంగా చెబుతారు. లింగాయత్ సామాజికవర్గమంతా తమకో నాయకుడు కావాలని కోరుకుని యడ్యూరప్పను ప్రోత్సహించింది.. ఇటీవల ఓ బహిరంగ సభలో కూడా ప్రధాని మోదీ స్వయంగా వీరేంద్ర పాటిల్ వ్యవహారాన్ని ప్రస్తావించి.. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఎలా అవమానం జరుగుతుందో వివరించారు..