ఆశ్రిత పక్షపాతం, మన వాళ్లు అనుకుంటే ఏదో విధంగా దోచిపెట్టడం దేశంలో కొన్ని పార్టీలకు నిత్యకృత్యమైంది. ఏదోక పదవి, ఉద్యోగం ఇచ్చేసి ఒక్కొక్కరి ఖాతాలో లక్షల రూపాయలు వేయడం సామాన్య విషయమైపోయింది. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఇదే తంతు కనిపిస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది.
400 మందిని తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్
దొడ్డిదారిన పదవులకు వచ్చిన 400 మందిని తొలగిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఉత్తర్వులు జారీ చేశారు. వారంతా సలహాదారులుగా, కన్సల్టెంట్స్ గా ఢిల్లీ ప్రభుత్వంలోని వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్నారు. స్వయం ప్రతిపత్తి ఉన్న కార్పొరేషన్లలో కొందరు తమ సేవలను అందిస్తున్నారు. మొత్తం 23 శాఖల్లో జరిగిన ఈ నియామకాల్లో పారదర్శకత కనిపించలేదని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం గుర్తించడంతో సత్వర చర్యలు చేపట్టారు. స్పెషలిస్టులు అన్న ట్యాగ్ లైన్ పెట్టేసి ప్రైవేటు వ్యక్తులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించారని ఎల్జీ కార్యాలయం ఆరోపించింది.అయితే సర్వీస్ డిపార్టమెంట్ సూచనల మేరకే వారిని తొలగించామని ఎల్జీ కార్యాలయం విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొంది.
అర్హత లేని వారికి పదవులు
ఢిల్లీ ఆప్ ప్రభుత్వం అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు మరో సారి రుజువైంది. ఫెలోస్, అసోసియేట్ ఫెలోస్, అడ్వయిజర్స్, డిప్యూటీ అడ్వయిజర్స్, స్పెషల్టిస్టు, సీనియర్ రీసెర్చ్ ఫెలో, కన్సల్టెంట్ పదవులు సృష్టించి ఐనవారికి వాటిని కట్టబెట్టారని ఎల్జీ కార్యాలయం జరిపిన దర్యాప్తుల్లో తేలడంతో దాని ఆధారంగా సర్వీస్ డిపార్టమెంట్ సలహా కోరారు. ఎలాంటి విద్యార్హత లేకుండా, సదరు రంగంలో అనుభవమూ లేకుండా ఆయా పదువులను అలంకరించారని గుర్తించారు. అర్హత లేని వారిని నియమించడం సహేతుకం కాదన్న నియమాన్ని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం పక్కన పెట్టింది.కనీసం వారి అర్హతతను వెరీఫై చేసినట్లుగా కనిపించలేదు. తాత్కాలిక ఉద్యోగుల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ ను పాటించాలన్న 2018 నాటి ఉత్తర్వులను సైతం కేజ్రీవాల్ సర్కరు తుంగలో తొక్కింది.
ఏపీలో సలహాదారుల మాటేమిటి ?
జగన్ అధికారానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించుకుంది. అవసరం లేకున్నా సలహాదారులను పెట్టి ప్రతీ ఒక్కరికీ లక్షల్లో జీతం, అలవెన్సులు ,కార్యాలయాల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తోంది. కోర్టులో కేసులు పడిన తర్వాత జగన్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులు ఉంటారని చెబుతూ హైకోర్టుకు విన్నవించుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న సలహాదారులను సంబంధింత మంత్రులకు సలహాదారులుగా రీడిజిగ్నేట్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కొనసాగింపుగా.. సలహాదారులు నిర్వహించాల్సిన పాత్ర, బాధ్యతలను నిర్వచిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విధానాల రూపకల్పనలో మంత్రులకు సలహాలివ్వడానికే సలహాదారులు పరిమితం అవుతారని పేర్కొంది. సివిల్ సర్వెంట్స్ రోజువారీ విధుల్లో వారి జోక్యం ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐనప్పటికీ అది వృధా వ్యయం కిందకే వస్తుంది. మరి ఢిల్లీ బాటలో ఏపీ గవర్నర్ పయనిస్తారో లేదో చూడాలి.