టీడీపీలో వైరాగ్యం – చంద్రబాబు అరెస్టూ క్యాడర్ ను కదిలించలేకపోతోందా ?

తెలుగుదేశంలో నిరాసక్తత పేరుకుపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం, జైలు పాలై రెండు వారాలు దాటిపోయింది. దీంతో స్థానిక నాయకులు, కేడర్‌లో కొంత నైరాశ్యం ఏర్పడింది. ఎన్నికల నాటికి పార్టీ కొంత పుంజుకుంటుందని భావించినా ప్రతికూల పరిస్థితుల కారణంగా సంక్షోభం వెంటాడుతోంది. సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కొరవడింది.

కార్యకర్తల్లో ఆందోళన

చంద్రబాబు అరెస్ట్ సంక్షోభం తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక వైపు సంక్షోభం తరుముకొస్తున్నా గ్రూపుల మధ్య ఐక్యతా రాగం కనిపించడం లేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి బలమైన కేడర్‌ ఉన్నట్లు కనిపిస్తున్నా నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నియోజకవర్గ ఇంఛార్జిలు, సీనియర్ నేతల మధ్య సమన్వయం ఇప్పటికీ ఎండమావి గానే ఉంది.

జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో అరెస్ట్

పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విస్తృతంగా నియోజకవర్గ సమీక్షలు నిర్వహించేవారు. జిల్లాలు తిరిగేవారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, నెలకోసారి సమావేశం నిర్వహించాలని, కార్యాలయం ప్రారంభించాలని అనుకున్నారు. పార్టీ సంక్షోభ పరిస్థితుల్లో వున్నా నాయకుల మధ్య ఐక్యతా రాగం కనిపించకపోవడంతో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం క్షీణిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జరుగుతున్న ధర్నా, ఆందోళన కార్యక్రమాల్లోనూ గ్రూపు రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాయకులు ఎవరికి వారే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

జిల్లాల్లో పార్టీ నాయకత్వం వైఫల్యం

పార్టీ జిల్లా స్థాయి నాయకత్వాలు శ్రేణుల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. నియోజకవర్గాల్లో అధికారపార్టీ నాయకుల అరాచకాలు చేస్తున్నారని అంటున్నారు కానీ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. అధికారపార్టీపై నెలకొన్న వ్యతిరేకతని సొమ్ము చేసుకోవడంలో టిడిపి నియోజకవర్గ నాయకులు విఫలమవుతున్నారు. మరో వైపు పోలీసుల నిర్బంధం .. తీవ్రమైన వేధింపులు ఉంటాయన్న కారణంగా సీరియస్ గా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు.

చంద్రబాబును ఎక్కువ కాలం జైల్లో ఉంచితే పరిస్థితి ఏమిటి?

చంద్రబాబుకు ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపేలా జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చంద్రబాబు సుదీర్ఘ కాలం జైల్లో ఉంటే పరిస్థితి ఏమిటన్నది టీడీపీ శ్రేణులకే అర్థం కావడం లేదు.