బొట్టు పెట్టుకునేందుకు కూడా ఓ పద్ధతుందని తెలుసా!

ఎంత అందగా తయారైనా, ఎంత మేకప్ వేసుకున్నా కానీ ముఖానికి బొట్టు పెట్టకపోతే ఆ అలంకారం సంపూర్ణం కాదు, ముఖానికి నిండుదనం రాదు. ఎందుకంటే ముఖానికి ఆకర్షణగా కనిపించేది బొట్టే. అయితే హిందూ సంప్రదాయంలో బొట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఐదో తనానికి చిహ్నంగా భావించే బొట్టు ముఖంపై కనిపించకపోవడాన్ని చాలా దోషంగా భావిస్తారు. బొట్టు పెట్టుకోకుంటే శుభకార్యాలు నిర్వహించే అర్హత లేదని హిందువులు విశ్వాసం. అంత విశిష్ఠత ఉన్న బొట్టు పెట్టుకునేందుకు కొన్ని పద్దతులున్నాయంటారు పండితులు.

బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి
బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కోవేలు వినియోగిస్తారు. మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటే శుభకరం, ఉంగరపు వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి, మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది, బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. కానీ చూపుడు వేలిని బొట్టు పెట్టుకునేందుకు వినియోగించరాదంటారు.

బొట్టు నుదుటిపైనే ఎందుకు
బొట్టు నుదుటిపైనే పెట్టుకోవాలనే సంప్రదాయం వెనక కారణాలున్నాయి. జ్ఞాపక శక్తికి, ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య తిలకం పెడతారు. నదురుని బ్రహ్మ స్థానంగా భావిస్తారు. అక్కడున్న బ్రహ్మరంధ్రాన్ని తట్టిలేపేందుకు బొట్టు పెట్టుకోవాలని చెబుతారు.

ఎరుపు బొట్టు ఎందుకు ప్రత్యేకం
బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారెందుకంటే… చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. మన ఆత్మ జ్యోతి స్వరూపం అని అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలంటారు. కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి శరీరాన్ని మరింత ఉత్తేజితం చేస్తుంది. కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానం విద్యుదయస్కాంత తరంగ రూపాల్లో శక్తిని వెలువరిస్తుంది. అందుకే విచారంగా ఉన్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకం లేక కుంకుమ నుదుటిని చల్లబర్చి వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాల్లో చందనం, విభూతి నుదుటున రాయడమూ మంచిదే. కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు. పురుషులు కూడా పెట్టుకోవచ్చు. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు.. పెద్దలు నేర్పించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.