ద్వారంపూడిపైనే పవన్ పోటీ – కాకినాడనే సెలక్ట్ చేసుకున్నారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేసి పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పొత్తుల్లో భాగంగా జనసేనకు కాస్త ఎక్కువ సీట్లు లభిస్తాయి. అందులో ఒక దాంట్లో పవన్ పోటీ చేయడమే ఖాయమనుకోవచ్చు.

కాపులకు బలమైన నియోజకవర్గం కాకినాడ

కాకినాడ కాపులకు బలమైన నియోజకవర్గంగా ఉంది. అక్కడ మెజార్టీ ప్రజలు కాపు వర్గానికి చెందినవారే. అందుకే పవన్ అక్కడ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ద్వారంపూడిచంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర అన్న పేరు ఉంది. అందుకే అన్ని రకాల సర్వేలు ఇతర నివేదికల ఆధారంగా కాకినాడను ఫైనల్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో తనపై పోటీ చేయాలని ద్వారంపూడి సవాల్

గతంలో వారాహి యాత్ర చేపట్టినప్పుడు పవన్ కల్యాణ్ ను ద్వారంపూడి సవాల్ చేశారు. తనపై పోటీకి రావాలన్నారు. ముద్రగడ కూడా అదే డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ద్వారంపూడిపై పోటీకి రావాలన్నారు. అప్పట్లో పవన్ ఈ చాలెంజ్ లపై పట్టించుకోలేదు. కానీ వాళ్లు చాలెంజ్ చేసినప్పుడు వదిలేసి ఇప్పుడు నిజంగానే కాకినాడలోనే పోటీ చేయడానికి డిసైడయినట్లుగా కనిపిస్తోంది.

సర్వేలతో ధైర్యం తెచ్చుకున్నారా ?

ఇప్పుడు అన్ని రకాల సర్వే నివేదికలను పరిశీలించిన తర్వాత పవన్ పోటీ చేస్తే కనీసం యాభై వేల మెజార్టీ వస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే కాకినాడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే పవన్ మూడు రోజుల పాటు ప్రత్యేకంగా కాకినాడలో మకాం వేస్తున్నారని అంటున్నారు. నిజంగా పోటీ చేస్తారా లేకపోతే.. ఇది కూడా ప్రచారమేనా అన్నది కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది