గుడివాడలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి నాని… మైకందుకుంటే టీడీపీ అధినేతపై విరుచుకుపడతారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కొడాలి నానిని గుడివాడలో ఓడించాలని టీడీపీ బలంగా ఫిక్సయ్యింది. ఈ సమయంలో గుడివాడ టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెనిగండ్ల రాముకు టిక్కెట్ ఖారరు చేశారని ప్రచారం ఊపందుకుంది. ఆయననే ఇంచార్జ్ గా నియమించారు. అయి.తే రావి వెంకటేశ్వరరావు మాత్రం తానే అభ్యర్థినని అనుకుంటున్నారు.
టిక్కెట్ తనకే కావాలంటున్న రావి వెంకటేశ్వరరావు
.గుడివాడ టీడీపీలో నేతలు గత కొంత కాలంగా గ్రూపులుగా విడిపోయారు. అందులో ఒకటి రావి వెంకటేశ్వర రావు వర్గం కాగా మరొకటి ఎన్నారై వెనిగండ్ల రాము వర్గమని అంటారు. వీరిలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తమ కంటే తమకంటూ గతకొంతకాలంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో వెనిగండ్ల రాము అభ్యర్ధిత్వాన్ని ఆల్ మోస్ట్ కన్ ఫాం చేసేశారని తెలుస్తున్న నేపథ్యంలో… రావి వెంకటేశ్వర రావుని బుజ్జగించారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. రావి వెంకటేశ్వరరావుకు పార్టీ న్యాయం చేస్తుందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థిని బలంగా ఢీకొట్టగలిగే నేత కావాలని స్పష్టం చేశారు. అంటే రావికి సామర్థ్యం లేదని చెప్పినట్లా అని ఆయన వర్గీయాలు మండిపడ్డారు.
రావిని ఎన్ని సార్లు మోసం చేస్తారు ?
ప్రతిసారి రావిని పార్టీ ఇలానే మోసం చేస్తోందంటూ కార్యకర్తలు నిలదీస్తున్నారు. గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని రావి వెంకటేశ్వరరావు చెబుతున్నారు. గుడివాడలో కొడాలి నాని ఎత్తుగడలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. అయితే బుజ్జగింపులు ఫలించాయో లేకపోతే.. అప్పటికి సర్దుకుపోదమనుకున్నారో కానీ.. సందర్భంగా రావి వెంకటేశ్వర రావు, వెనిగండ్ల రాములు చేతులు కలిపారు! గుడివాడలో టీడీపీ జెండా ఎగరేయడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. మొన్నటివరకు గుడివాడ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉండగా… ఆయన స్థానంలో వెనిగండ్ల రాముకు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇద్దరూ కలిసి పనిచేసే విషయంపై టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో… పార్టీ గెలుపుకోసం పనిచేస్తామఅంటూ రావి వెంకటేశ్వర రావు.. రాముతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతరిక్షం నుంచి వచ్చినా తనను ఓడించలేరన్న కొడాలి నాని
తనను ఓడించడానికి అమెరికా నుంచి కాదు, అంతరిక్షం నుంచి వచ్చినా అది జరిగే పని కాదని.. గెస్ట్ అప్పీరియన్స్ కి గుడివాడ ప్రజల నుంచి ఆదరణ దక్కదని.. గుడివాడలో తానే మరోసారి గెలిచి చూపిస్తానని.. తాను బ్రతికున్నంతకాలం గుడివాడ నియోజకవర్గం తనదే అని కొడాలి అంటున్నారు. అయితే.. అలా అనుకున్న వారు ప్రజల్ని తక్కువ చేసి శంకరగిరి మాన్యాలు కలిసిపోయారని ఇతర నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా గుడివాడ రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది.