తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను గురువారం నాడు విడుదల చేసింది. టిడిపి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇక మిగిలిన మూడు స్థానాల్లో ధర్మవరం బిజెపికి పొత్తుల్లో భాగంగా ఇచ్చారు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ పోటీలో ఉండనున్నారు. ఈ మేరకు ఆయన ప్రచారాన్ని గురువారం నుంచి ప్రారంభించారు. ఇవి పోను రెండు అసెంబ్లీ స్థానాలు పెండింగులోనున్నాయి. అనంతపురం, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా తక్కిన అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ టిడిపి అభ్యర్థులను ప్రకటించినట్టు అయ్యింది.
అనంతపురం అర్బన్ జనసేనకు కాదు టీడీపీకే !
పెండింగ్‌లో ఉన్న రెండింటిలోనూ అనంతపురం అర్బన్ నియోజకవర్గం పొత్తుల్లో జనసేనకు అని ప్రచారం జరిగినా ఆ అవకాశం లేదన్న చర్చ నడుస్తోంది. టిడిపినే ఈ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక గుంతకల్లుకు వైసిపి నుంచి టిడిపిలోకి చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అభ్యర్థుల పేర్లు ప్రకటించని రెండు చోట్లా గ్రూపులున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు అనంతపురానికి ప్రభాకర్ చౌదరి, గుంతకల్లు జితేందర్ గౌడ్లు మరోమారు తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని అడుగుతున్నారు. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు బికె.పార్థసారధికి స్థానం సర్దుబాటు చేయాల్సి ఉంది. పెనుకొండ టిక్కెట్టు సవితకు కేటాయించాక ఈయనకు ఎక్కడ నుంచి పోటీ చేయించే అవకాశం కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది.
పరిటాల శ్రీరామ్‌కు ఈ సారి చాన్స్ లేనట్లే !
పొత్తులో ధర్మవరం బిజెపికి వెళ్లాక అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ పరిస్థితి ఏమిటన్నది కూడా చర్చ నడుస్తోంది. టిక్కెట్టు దక్కకుండా మిగిలిన వారిలో కళ్యాణదుర్గం నుంచి హనుమంతరాయ చౌదరి కుటుంబం ఉంది. వీరందరికీ ప్రత్యామ్నాయం ఏమి చూపనున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టిడిపి ఇప్పటి వరకు రెండు పార్లమెంటు స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. హిందూపురం పార్లమెంటు బిజెపికి పొత్లుల్లో ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ ఆ పార్టీ అధిష్టానంతో జరిగిన చర్చల్లో ఈ అంశం ముందుకు రానట్టు తెలుస్తోంది.
రెండు పార్లమెంట్ సీట్లలోనూ టీడీపీ అభ్యర్థులే !
రెండు పార్లమెంటు స్థానాల్లోనూ టిడిపి అభ్యర్థులను బరిలో దింపాల్సి ఉంటుంది. ఈ స్థానాల్లో పాత వారినే ప్రకటిస్తుందా… లేక కొత్త మార్పులతో కొత్త వారికి అవకాశం కల్పిస్తుందా..? అన్నది చూడాల్సి ఉంది. మూడో జాబితా సమయానికి మిగిలిన రెండు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల అభ్యర్థులు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండింటిని బీసీ అభ్యర్థులకు ఇచ్చే అవకాశం ఉంది.