తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఒకటి కోరుట్ల. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అక్కడ్నుంచిపోటీ చేస్తున్నారు. 2018లో బీజేపీకి బలం ఉన్నప్పటికీ ఆ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి ప్రభావం అంతంత మాత్రమే ఉండటంతో మూడోస్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సారి సవాల్‌గా తీసుకుని ఎంపీ అర్వింద్ నిలబడటంతో పరిస్థితి మారిపోయింది.
కోరుట్లలో బలహీనపడ్డ బీఆర్ఎస్
బీఆర్ఎస్ నుంచి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి జువ్వాడి నర్సింగరావులు ఉన్నారు. ఈసారి ప్రధానంగా పోటీ బీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తేల్చారు. 2009 నుంచి ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విద్యాసాగర్ రావే అప్రతిహతంగా గెలుపొందుతూ వస్తున్నారు. 2014, 2018లో విద్యాసాగర్ రావుకు ప్రధాన ప్రత్యర్థి జువ్వాడి నర్సింగరావే. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. విద్యాసాగర్ రావు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ ఆయన కుమారుడు సంజయ్‌కి అవకాశం ఇచ్చింది. ఎప్పుడూ దొరలేనా అన్న భావన ప్రజల్లో పెరుగుతోంది.
బీసీల ఓట్లే కీలకం
కోరుట్ల నియోజకవర్గంలో మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, బెస్త (గంగపుత్రుల) సామాజికవర్గాల ఓట్లే కీలకం. ఈసారి అక్కడ పోటీ చేసే అభ్యర్థుల్లో ఇద్దరు వెలమ (సంజయ్, నర్సింగరావు), ఒకరు మున్నూరు కాపు (అర్వింద్) ఉండటంతో బీసీ సామాజికవర్గాలు ఎటువైపు మొగ్గుచూపుతాయనే చర్చ జరుగుతున్నది. అలాగే బీజేపీకి ఇక్కడ 15-20 వేల ఓటు బ్యాంకు ఉంటుంది. ఇవి అర్వింద్‌కు కలిసి వచ్చే అవకాశం ఉన్నదంటున్నారు.ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మున్నూరు కాపు సామాజికవర్గం వాళ్లు రాజకీయంగా ప్రభావితం చేస్తారనే వాదన ఉన్నది. అదే జరిగితే బీజేపీకి ఇది బలం అవుతుంది. ఇక ముదిరాజ్, పద్మశాలి, బెస్త సామాజికవర్గాల్లో ఎక్కువశాతం మంది కూడా బీజేపీ సిద్ధాంతాలను విశ్వసిస్తారు. వాళ్లు కూడా ఈసారి బీజేపీ అభ్యర్థికి అండగా నిలబడితే అర్వింద్ గెలుపు సులభమే అంటున్నారు.
త్రిముఖ పోటీలో బీజేపీకి అడ్వాంటేజ్
విద్యాసాగర్ రావు సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా ఉండటం.. కాంగ్రెస్ పార్టీకి ఉండే సంస్థాగత ఓటు బ్యాంకు నర్సింగరావుకు కలిసొచ్చినా అది గెలుపు తీరాల దాకా తీసుకుపోలేదని అంటున్నారు. దీంతో ఈసారి కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గానే ఉండబోతున్నదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చీల్చబోయే ఓట్లను బట్టి అక్కడ ఏ పార్టీ గెలుస్తుందన్నది నిర్ణయించబోతున్నది. బీజేపీ అభ్యర్థి అర్వింద్ వ్యవహారశైలి దూకడు యువతను ఆకట్టుకుంటోంది. బీఆర్ఎస్పై ఆయన పై చేయి సాధించడం ఖాయంగా భావిస్తున్నారు.