రాయచోటి నుంచి ధనుంజయరెడ్డి – సీఎం జగన్ కొత్త ఆలోచన

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. వైసీపీ స్థాపించకముందే సదరు ఎమ్మెల్యే కెరీర్‌కి పునాదులు వేశారు జగన్. అప్పటి నుంచే జగన్‌కి నమ్మిన బంటుగా మారిపోయారు ఆయన .. వైఎస్ మరణాతరం జగన్ వెన్నంటే ఉంటూ వస్తున్న ఆయన ఇప్పటికి అయిదు సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. అలాంటి నాయకుడి పొలిటికల్ కెరీర్‌కి ఈ సారి బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది.

రాయచోటి టిక్కెట్ విషయంలో జగన్ పునరాలోచన

కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే , చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. ఈ పేరు వైసీపీలో చాలా ప్రత్యేకమనే చెప్పాలి. శ్రీకాంత్ తనకు అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటు అని చాలా సందర్భాల్లో జగన్ స్వయంగా చెప్పారంటేనే.. పార్టీలో ఆయన ప్రాధాన్యత అర్థమవుతుంది. 2009 ఎన్నికల్లో తండ్రి దివంగత వైఎస్ దగ్గర పట్టుబట్టి మరీ శ్రీకాంత్ రెడ్డికి రాయచోటి టికెట్ ఇప్పించారు జగన్. శ్రీకాంత్‌రెడ్డి తండ్రి గడికోట మోహన్‌రెడ్డి 1999, 2004 ఎన్నికల్లో అప్పటి లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో అమెరికా వెళ్లి 11 ఏళ్లు ఐటీ కెరీర్‌లో శ్రీకాంత్.. రాజకీయాల మీద ఆసక్తితో ఏపీకి తిరిగొచ్చి తండ్రి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నారు. 2009 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో లక్కిరెడ్డిపల్లె సెగ్మెంట్ మాయమవ్వడంతో.. రాయచోటి నుంచి పోటీ చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు.

జగన్ కు సన్నిహితుడు

వైఎస్ మరణానంతరం కాంగ్రెస్‌ను వీడి జగన్ బాట పట్టిన ఆయన జగన్‌కు అత్యంత సన్నిహితులయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీ చీఫ్‌విప్‌గా ఉన్న శ్రీకాంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి రానున్న ఎన్నికల్లో బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. దానికి ఆయన స్వయంకృతాపరాధమే కారణమంటున్నారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాయచోటి కి ఏం చేశావని ప్రశ్నిస్తున్నారట అక్కడ ప్రజలు. గత 20 సంవత్సరాలలో రాయచోటిలో చెప్పుకోదగ్గ అభివృద్ది జరగకపోవడంతో.. ఆయనపై వ్యతిరేకత ఒక రేంజ్‌లో పెరిగిపోయిందని.. జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో తేలిందని అంటున్నారు. అదీకాక రాయచోటి నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ కళాశాల మైదానాన్ని వక్ఫ్ బోర్డు కు అప్పగించడంపై.. మిగిలిన వర్గాలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నాయంటున్నారు. కేవలం మైనారిటీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ.. ఇంకెవరూ రాయచోటిలో తనకు పోటీగా ఎదగకుండా అణగతొక్కారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.

ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి చాన్స్ ?

దాంతో వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్‌రెడ్డి పోటీ చేస్తే గెలిచే పరిస్థితే లేదని భావిస్తున్న జగన్.. రాయచోటికి చెందిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుత సీఎంఓ అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్ఢిని ఎన్నికల బరిలోకి దింపడానికి చూస్తున్నారంట. రాయచోటి మండలం చెన్నముక్కపల్లె kg ;zxofv ధనుంజయ రెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా బంధుగణం ఉండటంతో పాటు.. ఐఏఎస్ అధికారిగా అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో జగన్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.