ప్రజా సంక్షేమానికే ఢిల్లీ సర్వీసుల బిల్లు

ఏ చట్టాన్నైనా తొలుత విపక్షాలు వ్యతిరేకిస్తాయి.అందులో రంద్రాన్వేషణకే ప్రయత్నిస్తాయి. దానితో అంతా వినాశనమేనని వాదిస్తాయి. వాస్తవ స్థితిగతులను ప్రభుత్వం తేటతెల్లం చేసిన తర్వాత మౌనమే అంగీకారమన్నట్లుగా ఊరుకుంటాయి. ఢిల్లీ సర్వీసు బిల్లు విషయంలోనూ అదే జరిగింది. గోల గోల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఇప్పుడు మౌనగీతాలు ఆలాపిస్తున్నాయి….

రాజ్యసభలోనూ ఆమోదం..

ఢిల్లీ సర్వీసుల బిల్లుకు తొలుత లోక్ సభ ఆమోదం తెలిపింది. నిన్న రాత్రి బాగా పొద్దుపోయాక ఓటింగ్ నిర్వహించి రాజ్యసభ కూడా ఆమోదముద్ర వేసింది. లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు ఏ అభ్యంతరాలు చెప్పాయో… ఇప్పుడు కూడా అదే ధోరణిలో ప్రవర్తించాయి. చివరకు ఓటింగులో అనుకూలంగా 131, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చారు. అనూహ్యంగా కొన్ని ఎన్డీయేతర పార్టీలు కూడా బిల్లుకు మద్దతివ్వడం గమనార్హం. అందులో వైసీపీ, బీజేడీ కూడా ఉన్నాయి. ప్రజల హక్కుల్ని పరిరక్షించడానికి, సమర్థమైన, అవినీతిరహితమైన పాలనను అందించడానికే ఈ బిల్లును తీసుకువచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. కాంగ్రెస్ హయాం నుంచి వస్తున్న ఢిల్లీ పాలనా నిబంధనల్లో ఒక్క దానిని కూడా మార్చకపోయినా అభ్యంతరం ఎందుకని అమిత్ షా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉండే ఒక్క నిబంధనను కూడా ఏ కోణంలోనూ తాము చేర్చదలచుకోలేదన్నారు.

అసలేం జరిగింది..

మే 11 సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికి మూలమైంది. శాంతిభద్రతలు, పోలీసు విధులు తప్ప మిగతావన్నింటినీ ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే ఇదీ ఏమాత్రం సహేతుకం కాదని నిర్ణయానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం మే 19న ఒక ఆర్డినెన్స్ ను జారీ చేసింది. పోస్టింగులు, బదలీలు, విజిలెన్స్ లాంటి అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వం లెప్టినెంట్ గవర్నర్ కు సిఫారసు చేయాల్సిందేనని తేల్సేంది. ఆయా అంశాల్లో ఏ పనైనా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారానే జరగాలని ప్రకటించింది.

ఢిల్లీకి ఉన్న స్పెషల్ స్టేటస్ అలాంటింది..

ఢిల్లీ దేశానికి రాజధాని. ప్రపంచ దేశాల రాయబార కార్యాలయాలన్నీ అక్కడే ఉంటాయి. నిత్యం విదేశీ అతిధులు వస్తూనే ఉంటారు. అందుకనే జాతీయ రాజధానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారన్నది మరిచిపోకూడదు. కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వమూ కలిసి ఉమ్మడి బాధ్యతతో మాత్రమే ఢిల్లీ పాలనను నిర్వహించాల్సి ఉంటుందనడంలో సందేహ పడాల్సిన అవసరం లేదు. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం బదలీలు, విజిలెన్స్, ఇతర సంఘటనలకు సంబంధించిన అంశాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి తప్పకుండా లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి సిఫార్సుల రూపంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

బిల్లులో అదనంగా ఉన్నదేమిటి..

అవినీతి అధికారులను సస్పెండ్ చేసే అధికారం ఇకపై కేంద్రం పరిధిలో ఉంటుందని ఆ బిల్లు తేల్చింది. నేషనల్ కేపటిల్ సర్వీస్ అథారిటీ సిఫార్సులను అమలు జరిపే విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ దే పూర్తి విచక్షణాధికారమని బిల్లులో పొందుపరిచారు. అధికారులను పిలిపించి మాట్లాడటంతో పాటు అసెంబ్లీని నిరవధిక వాయిదా , రద్దు చేసే అధికారం కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కే ఈ బిల్లు అప్పగించింది.

విపక్షాల ఆరోపణలకు అమిత్ షా సమాధానం

అధికారాల బదలాయింపును ఈ బిల్లు అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థకు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కీలుబొమ్మగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే జాతి ప్రయోజనాలను, ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను సమన్వయ పరుచుకుని ఈ బిల్లును రూపొందించామని హోం మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. పూర్తి స్థాయి రాష్ట్రంగా ఢిల్లీని మార్చుతామని గతంలో హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు వెన్నుపోటు పొడిచిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. రాజ్యాంగబద్దత లేని ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీ భిన్నమని గుర్తిస్తే ఇంతటి చర్చే అవసరం ఉందన్నారు. పార్లమెంటు, దౌత్య కార్యాలయాలు, సుప్రీం కోర్టు ఢిల్లీలోనే ఉన్నాయని హోం మంత్రి గుర్తు చేశారు. ఇకపై ఎవరు ఎన్నికల్లో పోటీ చేసిన ఈ సంగతిని అర్థం చేసుకోవాలన్నారు. లోక్ సభ కూడా ఆమోదించినందున త్వరలో రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే ఈ బిల్లు చట్టంగా మారుతుంది.