ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి జైల్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. ఆయన అక్రమాలన్నింటినీ కోర్టు పరిణగలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. పైగా అన్ని అభియోగాల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లుగా న్యాయస్థానాలు ఒకటకటిగా గుర్తిస్తున్నాయి….
బెయిల్ నిరాకరించిన హైకోర్టు….
మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన అక్రమాలన్నింటికీ ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్లు కోర్టు ప్రకటించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా న్యాయస్థానం నిర్థారించింది. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను మటుమాయం చేస్తారని, సాక్ష్యులను బెదిరిస్తారని కోర్టు అభిప్రాయపడింది. ఆయన శక్తిమంతమైన, పరపతి ఉన్న నాయకుడని బయట ఉంటే ఆయన చర్యలను నియంత్రించలేమని కోర్టు తేల్చేసింది. సిసోడియా భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని న్యాయమూర్తి స్వరణా కాంతా శర్మ తీర్పులో పేర్కొన్నారు. గతంలో ఢిల్లీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన సిసోడియా.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు…
ప్రజాభిప్రాయాన్ని మార్చేసిన సిసోడియా…
సిసోడియా అక్రమాలకు అంతే లేకుండా పోయిందని కోర్టు అభిప్రాయపడింది. ముందే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విషయంలో ప్రజల అభిప్రాయాలను మార్చి ప్రచురించారని గుర్తించింది. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో దొంగ ఈ- మేయిల్స్ సృష్టించి వాటి ఆధారంగా నివేదిక రూపొందించారన్నారు. ఫీడ్ బ్యాక్ పేరుతో సొంత అభిప్రాయాలను చొప్పించారని కూడా నిర్ధారించారు. దీని కోసం అక్రమంగా కొంత మంది సేవలను వినియోగించుకున్నారని, వారి పేరుతో ఆప్ నేతలే ఈ – మేయిల్స్ పంపారని కూడా తేల్చేశారు.
భ్రమలు కలిగించే ప్రయత్నం…..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై ప్రజల్లో భ్రమలు కలిగించేందుకు ఆప్ ప్రభుత్వం నానాతంటాలు పడింది.సుదీర్ఘ విశ్లేషణ, సమాలోచనల తర్వాతే ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అవినీతి మొత్తం సిసోడియా మానస పుత్రికేనని కోర్టు గుర్తించింది. ఆప్ ప్రభుత్వాల్లో నిర్ణయాల్లో నిజాయితీ, సమగ్రత లోపించిందని కూడా అభిప్రాయపడింది. అవినీతి జరిగిన సమయంలో సిసోడియా వాడిన రెండు సెల్ ఫోన్లను విచారణాధికారులకు సమర్పించకపోవడం ఆయన అవినీతికి మరో నిదర్శనమవుతుంది. అవి కనిపించడం లేదని సిసోడియా చెప్పడం ఒట్టిమాటే అవుతుంది. సాక్ష్యాలు చెరిపేసేందుకే సెల్ ఫోన్లు మాయం చేశారని కోర్టు నిర్ధారించింది. అనేక మంది ప్రభుత్వోద్యోగులు సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందున ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది…