పాకిస్థాన్లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ కు మనం దేశంలో జరిగే ప్రతీ చీకటి వ్యాపారానికి లింకు బయటపడుతూనే ఉంది. ఛత్తీస్ గడ్ ప్రభుత్వాన్ని కుదిపేస్తూ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ కు 500 కోట్లు అందాయన్న ఆరోపణలు వస్తున్న మహదేవ్ యాప్ వ్యవహారంలో సైతం దావూద్ హస్తమున్నట్లు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. డ్రగ్స్, బెట్టింగ్ వ్యవహారాల్లో దావూద్ నెంబర్ వన్ గా ఉన్నప్పటికీ అతని నేర సామ్రాజ్యం మన దేశంలో ఇంతగా వేళ్లూనుకుందని కూడా ఎవరూ ఊహించని పరిణామమేనని చెప్పారి. డీ గ్యాంగ్ కార్యకలాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయనేందుకు మహదావ్ యాప్ ను ఒక నిదర్శనంగా కూడా తీసుకోవచ్చు.
బాఘేల్ ఆదేశాల మేరకే దుబాయ్ ఆపరేషన్స్
ఎన్నికలు జరుగుతున్న వేళ మహదేవ్ బెట్టింగ్ యాప్ లో బాఘేల్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు రోజుకు ఒకటి బయట పడుతున్నాయి. ప్రధాన నిందితుడు సౌరబ్ చక్రధర్ తో ఆయనకు డైరెక్టు లింక్ ఉన్నట్లు పలు సాక్ష్యాలు వెల్లడవుతున్నాయి. తాను ముఖ్యమంత్రితో మూడు నాలుగు సార్లు సమావేశమయ్యాయని మరో నిందితుడు అభిషేక్ చెబుతున్నాడు. మహదేవ్ యాప్ సహ యజమాని అయిన శుభం సోనీ కూడా సీఎంతో మాట్లాడినట్లు ఆధారాలు దొరుకుతున్నాయి. యాప్ కార్యకలాపాలన్నీ బాఘేల్ ఆదేశాల మేరకే దుబాయ్ కు మార్చినట్లు వాళ్లు చెబుతున్నారు. మొత్తం వ్యవహారం వెనుక డీ గ్యాంగ్ ఉన్నట్లు అభిషేక్ వెల్లడించాడు.
పలు వ్యాపారాల్లో చక్రధర్ హస్తం
దుబాయ్ లో చీకటి వ్యాపారాలు చేసే పలువురితో చక్రధర్ కు లింకులున్నాయి. చిన్న బెట్టింగులతో ప్రారంభించిన వాటిని కలుపుతూ మహదేవ్ యాప్ ను సృష్టించారని అతని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ రేంజ్ లో ఎదగాలన్న కోరిక ఆతనికి ఉందని చెబుతున్నారు. బెట్టింగ్ ఫ్లాట్ ఫాంతో పాటు బంగారం స్మగ్లింగ్, హవాలా వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు అందుకు సహకరించే డీ గ్యాంగ్ కు ముడుపులు చేరుతున్నట్లు తెలుస్తోంది. తనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతీ నెల కొంత డబ్బు పాకిస్థాన్ చేరవేస్తున్నాడు. మూడేళ్లలో చక్రధర్ వ్యాపారం రూ. 70 వేల కోట్ల వరకు చేరింది.
సమన్లు జారీచేయనున్న ఈడీ..
బెట్టింగ్ స్కాంలో మరిన్ని నిజాలు బయటకు తీసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఛత్తీస్ గఢ్ పోలీసుల సహకారంతో బెట్టింగ్ వ్యాపారం జరుగుతున్నట్లు గుర్తించి కొందరు అధికారులకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఛత్తీస్ గఢ్ పోలీసు ఉన్నతాధికారులే కొంతమేర దర్యాప్తు చేసినట్లు గుర్తించింది. భిలాయ్ జిల్లా ఎస్టీ అభిషేక్ పల్లవ్ తొలుత దీనిపై దృష్టి పెట్టి తమ డిపార్టమెంటులో పనిచేసే కానిస్టేబులు సాయిదేవ్ తో పాటు కొందరు ఎస్ఐల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు నిగ్గు తేల్చారు. సాయిదేవ్ భార్య ఖాతాలోకి వచ్చిన రూ.3.5 కోట్ల రూపాయలు లెక్కతేలాల్సి ఉంది. చాలా మంది పోలీసు అధికారులకు ముడుపులు అందాయని తెలియడం ఒక వంతయితే.. పోలీసులకు – రాజకీయ నాయకులకు లింక్ ను కనిపెట్టే ప్రయత్నం రెండో వంతుగా చెప్పుకోవాలి.