లోక్ సభ ఎన్నికల్లో దళపతి విజయ్ పోటీ…

తమిళ అగ్రనటుడు దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. తన అభిమాన సంఘాల నేతలతో సమావేశమైన ఆయన పూర్తి కార్యాచరణను రూపొందించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రజా శ్రేయస్సు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు…

నెల రోజుల్లో పార్టీ రిజిస్టేషన్…

విజయ్ మక్కల్ ఇయక్కం అంటే విజయ్ అభిమాన సంఘాల సమాఖ్య సమావేశంలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. పార్టీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు, ప్రజాసంక్షేమం కోసమే పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. నిజానికి 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ పెడితే విజయం ఖాయమని విజయ్ ఆశించారు. అభిమాన సంఘాల ఆలోచన మాత్రం వేరుగా ఉంది. ఇప్పుడే పార్టీ పెడితే వేడిలో వేడిగా లోక్ సభ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని వారన్నారు. వారి అభ్యర్థనకు అంగీకరించిన విజయ్ ఫిబ్రవరి నెలలో పార్టీని నమోదు చేసి వెంటనే ప్రజాక్షేత్రంలోకి వెళదామని ప్రకటించారు.

కార్యకర్తల ముందస్తు ఏర్పాట్లు

విజయ్ అభిమాన సంఘాలకు ఆయన నుంచి ముందే సంకేతాలు అందాయి.విజయ్‌ నిర్ణయంతో సభ్యులు రాజకీయ పార్టీ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు తమిళ రాజకీయాల్లో టాక్‌ వినిపిస్తోంది . చెన్నైలోని పయనూరులో 150 మంది ఎంపిక చేసిన కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి అభిమాన సంఘాల నేతలు వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా పార్టీ శాఖలు ప్రారంభించాలన్న సంకల్పం విజయ్ లో కనిపిస్తోంది. పార్టీ పేరు, విధివిధానాలు, జెండా, అజెండా వీలైనంత త్వరలో ప్రకటించాలన్న ఆకాంక్ష విజయ్ అభిమానులు వెలిబుచ్చారు.

తొలి టార్గెట్ అన్నాడీఎంకే

దళపతి విజయ్ తొలి టార్గెట్ అన్నాడీఎంకే అని తేలిపోయింది. ఎంజీఆర్, జయలలిత అగ్రనాయకులు నిర్వహించిన అన్నాడీఎంకే ఇప్పుడు చీలికలు, పీలికలుగా తయారైంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వాన్నే ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుత నేత ఎడపాటి పళణిస్వామికి పెద్దగా ప్రజాదరణ లేదని తేలిపోయింది. పైగా తొందరపాటు చర్యలతో కేంద్రంలోని బీజేపీని ఆ పార్టీ నేతలు దూరేం చేసుకున్నారు. దీనితో రోజురోజుకు అన్నాడీఎంకే జనాదరణ కోల్పోతోంది. కార్యకర్తలు డీలా పడిపోయి ఎవరికి వారే అన్నట్లుగా తయారయ్యారు. క్రియాశీల కార్యకర్తలంతా కొత్త నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఏదైనా కొత్త పార్టీ వస్తే అందులో చేరిపోదామని అన్నాడీఎంకేలోని పొలిటికల్ వర్కర్స్ ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి నటుడు విజయ్ ఆశాకిరణమవుతారు. ఎంజీఆర్, జయలలిత లాగే ఆయనకు కూడా సినిమా గ్లామర్ ఉంది. ప్రజా సేవ చేయాలన్న కోరిక ఉంది. ముందు కార్యకర్తల బలం పెంచుకోవాలంటే అన్నాడీఎంకే నుంచి జనాన్ని లాక్కోవడం తొలి మారం అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…