బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్ దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈమేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్లో వెల్లడించారు. ఐదు దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హిందీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు వహీదా.
తెలుగులో ‘రోజులు మారాయి’
వహీదా రెహమాన్ 1955లో తెరకెక్కిన ‘రోజులు మారాయి’ తెలుగు సినిమాలో నటించారు. ఇందులో ‘ఏరువాక సాగారో రన్నో..’ పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 1956లో సీఐడీ తో బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కడ ‘ప్యాసా’, ‘గైడ్’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఐదు దశాబ్దాల కాలంలో అన్ని భాషల్లో కలిపి మొత్తం 90కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించారు. చివరిసారిగా కమల్ హాసన్ విశ్వరూపం , స్కేటర్ గర్ల్ సినిమాలో వహీదా అతిథి పాత్రలో నటించారు.
పురస్కారాలివే
వహీదా రెహ్మాన్‌ను 1972లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది, తర్వాత 2011లో ఆమె పద్మభూషణ్‌ను అందుకున్నారు. వహీదా రెహ్మాన్ ఐదు దశాబ్దాలకు పైగా కెరీర్లో 90కి పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. 50 ఏళ్ల పాటు ఆమె సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది.
69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో అవార్డు అందజేత
వహీదా ప్రస్తుతం ముంబై లో నివసిస్తున్నారు. 1974లో శశిరేఖ్ ని వివాహం చేసుకున్నారు. ఆయనను కమల్జీత్ అని పిలుస్తారు. తను కూడా హిందీలో పలు సినిమాల్లో నటించారు. 21 నవంబర్ 2000న కమల్జీత్ మరణం తర్వాత వహీదా ముంబైలో తన పిల్లతో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం వహీదా రెహమాన్ వయసు 85 ఏళ్లు. 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో వహీదాకు ఫాల్కే అవార్డును అందజేయనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీలోని అయిదుగురు సభ్యులు వహీదా రెహమాన్ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.