కాంగ్రెస్ కు కౌంటర్ – అమిత్ షా అజెండాలో మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ పై అన్ని పార్టీల దృష్టి పడింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మళ్లీ గెలిచి చరిత్ర సృష్టించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ దిశగా కాంగ్రెస్ కంటే ఆ పార్టీ ఎంతో ముందుందనే చెప్పాలి. బీజేపీ ఎక్కడ సభలు నిర్వహించినా జనం భారీ సంఖ్యలో వస్తూ కమలానికి తమ ఆమోదాన్ని ప్రకటిస్తున్నారు. మోదీ నాయకత్వానికి జై కొడతామని చెబుతున్నారు..

ఇండోర్ లో షా

అత్యంత పరిశుభ్రమైన నగరం, మధ్యప్రదేశ్ కు వాణిజ్య రాజధానిగా భావించే ఇండోర్ పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ఇరవై రోజుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు సార్లు ఇండోర్ వచ్చారు. తాజాగా ఇండోర్ -2 నియోజకవర్గంలో బూత్ లెవల్ వర్కర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మాల్వా – నిమార్ ప్రాంతంలోని 66 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 40 నియోజకవర్గాల బూత్ లెవల్ వర్కర్స్ ఈ కార్యక్రమానికి హాజరై అమిత్ షా సలహాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కనీవినీ ఎరుగుని విజయాన్ని సాధించి పెట్టాలని కార్యకర్తలకు అమిత్ షా ఉపదేశం చేశారు. స్టేజీ మీద కూర్చున్న నేతలు పార్టీని గెలిపించలేరని, కార్యకర్తలే ఆ పనిచేయగలరని చెబుతూ వారిని ఉత్తేజ పరిచారు.

పేదల పక్షపాతి మోదీ…

ప్రధాని మోదీ ప్రజా నాయకుడని,పేదల పక్షపాతి అని అమిత్ షా గుర్తుచేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒరిగిందేమి లేదని, మోదీ మాత్రమే వారి అభ్యున్నతికి కృషి చేశారని అమిత్ షా అన్నారు. గత ముఖ్యమంత్రులు దిగ్విజయ్ సింగ్. కమల్ నాథ్ పాలనలో అవినీతి విలయ తాండవమాడిందన్నారు. కమల్ నాథ్ కరెప్షన్ నాథ్ అయిపోయారన్నారు. 18 వేల మంది క్లాస్ వన్ అధికారులను బదిలీ చేసి పెద్ద బదిలీ పరశ్రమకే తెరతీశారన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి.. డబుల్ ఇంజన్ సర్కారును సమర్థంగా నిర్వహిస్తున్నారని అమిత్ షా విశ్లేషించారు. సర్జికల్ దాడుల నుంచి రామాలయం నిర్మాణం వరకు ప్రతీ అంశం బీజేపీ విజయమేనని ఆయన చెప్పుకున్నారు. వాటన్నింటినీ బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తే మధ్యప్రదేశ్లో విజయం తధ్యమన్నారు.

ఇంటింటికి వెళ్లాలని సూచన..
బూత్ లెవల్ వర్కర్స్ అంతా ఇంటింటికి వెళ్లాలని పార్టీ విధానాలను ప్రచారం చేయాలని అమిత్ షా సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టే బాధ్యతను కూడా వారిపైనే పెట్టారు. ఇండోర్ ప్రాంతంలోని 66 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 57 చోట్ల గెలిచింది. ఈ సారి మొత్తం 66 చోట్ల గెలవాలన్న లక్ష్యంగా పెట్టుకుంది.