దేశంలోని అనేక రాష్ట్రాల్లో కుడిఎడమల అవినీతి కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మెడకు చుట్టుకుని ఉచ్చు బిగుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే జైల్లో ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ తీరుపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో అవినీతి ఆరోపణ తెరపైకి వచ్చింది. కేసులు ఒకటొకటిగా బయట పడుతున్నాయని ఢిల్లీ విపక్షాలు అంటున్నాయి.
తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు..
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం ముడుపులు చేతులు మారడానికి కేంద్ర బిందువైందని లోక్ సభ సభ్యుడు మనోజ్ తివారీ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. శాశ్వత గదుల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.9 లక్షలు, తాత్కాలిక గదుల నిర్మాణానికి ఒక్కో దానికి రూ. 32 లక్షలు ఎలా కేటాయిస్తారని తివారీ ప్రశ్నించారు. శాశ్వత గదుల కంటే తాత్కాలిక గదుల నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుందా అన్నది ఆయన ప్రశ్న. ఢిల్లీ లోకాయుక్తకు విజిలెన్స్ డైరెక్టరేట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము ఈ అంశాన్ని మీడియాకు విడుదల చేస్తున్నామని తివారీ చెబుతున్నారు.
గదుల సంఖ్య తగ్గించినా..
నిజానికి 2018లోనే మనోజ్ తివారీ దీనిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పట్టించుకోకపోవడం వల్లే స్కాము స్థాం స్థాయి పెరిగిందని ఆయన ఆరోపించారు. ఒక దశలో నిర్మించే తరగతి గదుల సంఖ్యను 7,180 నుంచి 4,126కు తగ్గించారు. అయితే మొత్తం నిర్మాణంపై బడ్జెట్ వ్యయం మాత్రం పైసా కూడా తగ్గలేదు. దీనిపై ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ నిలదీస్తోంది. ఆప్ ప్రభుత్వం దొంగల ముఠాగా తయారైందని బీజేపీ గట్టి ఆరోపణలు చేస్తోంది. స్కాంకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని కమలం పార్టీ ఆరోపిస్తోంది.
కొలిక్కి రాని బస్సుల స్కాం
గతంలో ఆప్ పై నమోదైన ప్యానిక్ బటన్ స్కాం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఢిల్లీ బస్సుల్లో ఏమైనా అనుకోనిది జరిగితే తక్షణమే స్పందించి రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు సాయపడేందుకు వీలుగా ప్రతీ వాహనంలో ప్యానిక్ బటన్స్ ఏర్పాటు చేశారు. అందులో పెద్ద స్కాం జరిగిందని , ఆమ్ ఆద్మీ ప్రభుత్వం (ఆప్) కోట్లాది రూపాయలు స్వాహా చేసిందని ఢిల్లీ బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ప్రతీ బస్సులోను రెండు వైర్ లెస్ వాకీటాకీలు, మూడు సీసీటీవీలు, ఒక జీపీఎస్ సిస్టమ్, పది ప్యానిక్ బటన్స్ ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీలోని 4,500 బస్సుల్లో ఈ సిస్టమ్ అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు ఆ ప్యానిక్ బటన్ నొక్కితే అది కమాండ్ కంట్రోల్ కు సమాచారం అందిస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన సెక్యూరిటీ వ్యవస్థలో అన్ని లోపాలే కనిపిస్తున్నాయని విజిలెన్స్ నిగ్గు తేల్చింది. నిర్వహణ లోపాలతో ప్యానిక్ బటన్ వ్యవస్థ నిర్వీర్యమైంది. దానిపై విచారణ నానుతుండగానే ఇప్పుడు తరగతి గదుల స్కాం బయట పడింది. చూడాలి ఏం జరుగుతుందో…