ఎన్డీయే ఎంపీలను క్లస్టర్లుగా విభజించి ఏర్పాటు చేస్తున్న మీటింగులు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ప్రతీ ఎంపీని పేరుపేరునా పలుకరిస్తున్న ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల కోసం వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇండియా కూటమి నేతలను ఎలా ఎదుర్కోవాలో వారికి వివరించి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనత తగదని ఆయన ఉద్భోదిస్తున్నారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యం..
తూర్పు ఊత్తర ప్రదేశ్ , దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని మోదీ విడివిడిగా సమావేశమయ్యారు. 45 మంది తూర్పు యూపీ ఎంపీలతో తొలుత ఆయన భేటీ నిర్వహించారు. ప్రధాని ప్రాతినిధ్యం వహించే వారణాసి కూడా తూర్పు ఉత్తర ప్రదేశ్ కిందకే వస్తుంది. ఈ సమావేశాన్ని సీనియర్ మంత్రి మహేంద్రనాథ్ పాండే నిర్వహించగా, ఎన్డీయే నేత అనుప్రియా పటేల్ అనుసంధానకర్తగా వ్యవహరించారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్లగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. గరీబీ సబ్సే బడీ జాతి హై (పేదరికం అతి పెద్ద కులం) అని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పేదరికాన్ని నిర్మూలిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
సోషల్ మీడియాను యాక్టివ్ చేయండి
బీజేపీ ఎంపీలంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, సోషల్ మీడియా గ్రూపులను క్రియాశీలంగా ఉంచాలని మోదీ పిలుపునిచ్చారు. అప్పుడే విపక్షాల తప్పుడు ప్రచారాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆయన తేల్చేశారు. డిజిటల్ ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల్లో నిపుణుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ఎన్డీయే చేపట్టిన ప్రతీ కార్యక్రమ వివరాలు ఇంటింటికి చేరాలని అన్నారు. ఇందుకోసం కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రజల్లో ఎప్పుడూ టచ్ లో ఉండాలని ఆయన సూచించారు. అప్పుడే ఎంపీలు చేస్తున్న ప్రజా సంక్షేమ చర్యలు ప్రతీ ఒక్కరి అవగాహనకు వస్తాయన్నారు. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే కంటే.. అమలులో ఉన్న వాటిని సమర్థంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ విజయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే మంచిదన్నారు. ఓట్ల కోసం ఆర్టికల్ 370,రామమందిరం ఉపయోగపడినా… ప్రజాసేవకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
దక్షిణాది రాష్ట్రాలపై మోదీ దృష్టి..
ఒకే రోజు మోదీ నిర్వహించిన రెండో సమావేశం దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో జరిగింది. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, మురళీధరన్ ఈ మీటింగును నిర్వహించారు. మోదీ ప్రసంగించిన సమావేశంలో నడ్డా, గడ్కరీతో పాటు అన్ని దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు పాల్గొన్నారు. దక్షిణాదిలోని విపక్ష పాలిత రాష్ట్రాల్లో అవినీతి వేళ్లూనుకుందని మోదీ అభిప్రాయపడ్డారు. విపక్షాల పాలిత రాష్ట్రాల్లో ఉచితాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయని, ఎన్డీయే మాత్రం అలాంటి ప్రయత్నాలకు వెళ్లకుండా వాటిని అడ్డుకోవాలని మోదీ తేల్చేశారు. దక్షిణాది నేతల చర్యల వల్ల దీర్ఘకాలికంగా దేశ ప్రయోజనం దెబ్బతింటుందన్నారు. స్వార్థ చింతనతో ఏర్పాటైన ఇండియా కూటమికి ఓటమి ఖాయమని ప్రధాని మోదీ అన్నారు.